భారత ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కి కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. ఈ బ్యాంకుపై ప్రజలకు అపారమైన నమ్మకం. డిపాజిట్లు చేయాలన్నా, లోన్లు తీసుకోవాలన్నా ముందుగా ఎస్‌బీఐనే ఆశ్రయిస్తుంటారు. తమ కస్టమర్ల కోసం వివిధ రకాల సేవలందిస్తుంటుంది రుణాలు, డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్ వంటి సేవలు ఉన్నాయి. అలాగే ప్రజల అవసరాలకు అనుగుణంగా, మార్కెట్ పరిస్థితులకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్నిసార్లు అది కస్టమర్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. తాజాగా రుణాలపై వడ్డీ రేట్లకు ప్రాతిపదికంగా తీసుకునే ఎంసీఎల్ఆర్ రేట్లను సవరించినట్లు తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 15, 2024 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది.
సాధారణంగా ప్రతి నెలలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తాయి. ఇప్పుడు ఎస్‌బీఐ సైతం మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను సవరించింది. అక్టోబర్ 15 వరకు ఈ వడ్డీ రేట్లు అమలులోనే ఉండనున్నాయి. సవరించిన వడ్డీ రేట్ల ప్రకరాం.. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 8.20 శాతంగా ఉంది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు 8.45 శాతంగా ఉండగా.. 3 నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతం, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.85 శాతంగా ఉంది. అలాగే ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటు 8.95 శాతంగా ఉంది. రెండేళశ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు వరసుగా 9.05 శాతం, 9.10 శాతంగా ఉన్నాయి. ఈ ఎంసీఎల్ఆర్ రేటునే రుణ ఆధారిత వడ్డీ రేటు అంటారు. బ్యాంకులు రుణాలపై వసూలు చేసే కనీస వడ్డీ రేటు. ఇంత కంటే తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వడానికి లేదు. సాధారణంగా కన్జ్యూమర్ రుణాలైన హోమ్ లోన్స్, ఆటో లోన్స్ వంటివి ఏడాది ఎంసీఎల్ఆర్‌కు లింక్ అయి ఉంటాయి. పర్సనల్ లోన్స్ అనేవి రెండేళ్ల ఎంసీఎల్ఆర్‌తో లింక్ అయి ఉంటాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు రూ.10 లక్షల పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకుందాం. అప్పుడు మీరు ముందుగానే నెల వారీ ఈఎంఐ ఎంత పడుతుందో ఆన్‌లైన్ కాలిక్యులేటర్ ద్వారా తెలుసుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉండి, క్రెడిట్ హిస్టరీ ఉన్న వారికి బ్యాంకులు కనీస వడ్డీ రేటుకే లోన్లు ఇస్తాయి. ప్రస్తుతం రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతంగా ఉంది. ఇది కనీస వడ్డీ రేటు. దీని ప్రకారం లెక్కేస్తే మీరు 9.05 శాతం వడ్డీతో లోన్ తీసుకుని 5 ఏళ్ల టెన్యూర్ ఎంచుకున్నారు అనుకుందాం. దీని ప్రకారం మీరు నెలకు రూ.20,780 వరకు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. అయితే, ఈ వడ్డీ రేటు అందరికీ రాకపోవచ్చు. సగటు కస్టమర్‌కి ఎస్‌బీఐలో ప్రస్తుతం లోన్ వడ్డీ రేట్లు 11.45 శాతంగా ఉంది. దీని ప్రకారం లెక్కేస్తే అప్పుడు మీరు నెలకు రూ.21,940 వరకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. మొత్తంగా ఐదేళ్ల నాటికి అసలు వడ్డీ కలిపి రూ.13.16 లక్షల వరకు చెల్లిస్తారు.