తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు మద్దతుగా నిలిచే ప్రక్రియలో భాగంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన గ్రూప్- సీ, గ్రూప్- బీ (నాన్ గెజిటెడ్) ఉద్యోగులకు గత ఆర్థిక ఏడాది 2023-24కు సంబంధించిన ఉత్పత్తి ఆధారిత బోనస్ (పీఎల్బీ) పేమెంట్‌లో కొంత అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తామని తెలిపింది. ఉద్యోగులకు పండగల సమయంలో ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ అడ్వాన్స్ బోనస్ చెల్లింపులు చేస్తున్నామని తెలిపింది. మొత్తంగా ఉద్యోగులకు ప్రస్తుతం 60 రోజుల శాలరీ బోనస్ రూపంలో అందనుంది.
అర్హత గల గ్రూప్ సీ, గ్రూప్ బీ ఉద్యోగులకు 2023-24 ఆర్థిక ఏడాదికి గానూ రావాల్సిన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌లో ప్రస్తుతం 60 రోజుల బోనస్ అడ్వాన్స్‌గా చెల్లిస్తామని తెలిపింది. దీంతో ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.13,816 వరకు పడతాయని ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అర్హత కలిగి సిబ్బంది ఈ అడ్వాన్స్ వారి పీఎల్‌బీకి సర్దుబాటు చేసిందని, అదనంగా బోనస్ డబ్బులు ఖాతాలోకి వస్తే వెంటనే వాపస్ చేస్తామని సూచిస్తూ సంతకం చేసిన అండర్ టేకింగ్ సమర్పించాలని ఆదేశించింది.
అలాగే ఇప్పటికే ఈపీఎఫ్ఓ నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఈ అడ్వాన్స్ అనేది రాదని స్పష్టం చేసింది. అక్టోబర్ 11, 2024 లోపు ఈ అడ్వాన్స్ చెల్లింపులు పూర్తి చేయాలని సంబంధిత యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎంత మంది ఉద్యోగులు, ఎంత డబ్బు పంపిణీ చేశారు అనే పూర్తి వివరాలు అందించాలని స్పష్టం చేసింది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ బడ్జెట్ నుంచే ఈ అడ్వాన్స్ పేమెంట్లు ఉంటాయని తెలిపింది. ముందస్తు చెల్లింపు ఉత్పత్తి ఆధారిత బోనస్ మంజూరుకు వర్తించే, అనుబంధించబడిన అదే నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో అక్టోబర్ 11, 2024 లోపు ఈపీఎఫ్ఓ గ్రేడ్ సీ, గ్రేడ్ బీ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. దసరా లోపు ఖాతాలోకి డబ్బులు వేస్తుడడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.