సంప్రదాయ పెట్టుబడి పథకాలపై వచ్చే రాబడిని తక్కువగా భావించేవారు, రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడే వారు ఈక్విటీ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈక్విటీ మార్కెట్‌ల ఫలితాలు మెరుగ్గా ఉన్న కారణంగా చాలా మంది వీటి వైపు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లలో రిస్క్ ఉన్నప్పటికీ స్మాల్ క్యాప్ ఫండ్లపై ఇన్వెస్టర్లు కొన్నేళ్ల నుంచి అధిక రాబడులు అందుకుంటున్నారు. ఈ మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడి పెట్టేందుకు స్మాల్ క్యాప్ కేటగిరీ నుంచి షేర్లను ఎంచుకుంటాయి. రూ.5 వేల కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కపెనీల షేర్లలో పెట్టుబడులు పెడతాయి. ఇతర ఫండ్లతో పోలిస్తే ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. స్వల్ప ఒడిదుడుకులు వచ్చినా స్మాల్ క్యాప్ కంపెనీల షేర్లపై ప్రభావం పడుతుంది.
అయినప్పటికీ గత 3, 5, 10 ఏళ్లలో కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్లు మంచి రాబడులను అందించాయి. 2024, అక్టోబర్ 17 వరకు అత్యుత్తమ పని తీరు కనబరిటిన కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్లను ఇప్పుడు తెలుసుకుందాం. అందులో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో 29 శాతం, 5 ఏళ్లలో 38 శాతం, 10 ఏళ్లలో 24 శాతం రాబడులు ఇచ్చింది. ఇక టాటా స్మాల్ క్యాప్ ఫండ్ మూడేళ్లలో 28 శాతం, 5 ఏళ్లలో 36 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ మూడేళ్లలో 25 శాతం, ఐదేళ్లలో 31 శాతం మేర రాబడులు ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ స్మాల్ క్యాప్ ఫండ్ మూడేళ్లలో 23 శాతం, ఐదేళ్లలో 31 శాతం, 10 ఏళ్లలో 21 శాతం రాబడులు ఇచ్చింది.
ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌కు చెందిన ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ గత మూడేళ్లలో 22 శాతం రాబడులు ఇవ్వగా గత 5 ఏళ్లలో 30 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇక గడిచిన 10 ఏళ్లలో చూసుకుంటే 24 శాతం లాభాలు అందించింది. ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్‌లో గత ఐదేళ్ల క్రితం నెలకు రూ. 5 వేల చొప్పున సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా పొదుపు చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఆ పెట్టుబడి రెండింతలు అవుతుంది. మీ పెట్టుబడి మొత్తం రూ.3 లక్షలు అవుతుంది. దానిపై కాంపౌండింగ్ ఇంట్రెస్ట్‌తో 30 శాతం రిటర్న్స్ అంచనాతో వడ్డీ రూ.3.96 లక్షలకుపైగా అవుతుంది. అంటే 5 ఏళ్ల తర్వాత చేతికి రూ.6.96 లక్షల పైన అందినట్లయింది.