రూ.10 నాణెం చెల్లుబాటుపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ కీలక ప్రకటన చేశారు. రూ.10 నాణేలు చట్టబద్ధమైనవేనని, వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఆయన వెల్లడించారు.హైదరాబాద్‌లోని కోఠి బ్యాంకు వద్ద రూ.10 నాణేల చలామణిపై ఆవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ నాణేల చలామణిని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలనే ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.తమ బ్యాంకు ఖాతాదాలు ఎవరైనా ఈ నాణేలను నిరభ్యంతరంగా వినియోగించవచ్చని స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఇవి చెల్లుబాటు అవుతున్నాయన్నారు. రూ.10 నాణేలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. రూ.10 నోటు కంటే నాణెం ఎక్కువ కాలం మన్నికతో ఉంటుందన్నారు.