ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం గత కొన్నేళ్లుగా చాలా రకాల ఫండ్స్ హైరిటర్న్స్ అందిస్తుండడమే. దీంతో అసెట్ మేనేజ్మెంట్ సంస్థలు సైతం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫండ్స్ తీసుకొస్తున్నాయి. భవిష్యత్తులో మంచి లాభాలను అందించే రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రత్యేక పోర్ట్ ఫోలియోలను రూపొందిస్తున్నాయి. దీంతో మదుపరులు న్యూ ఫండ్ ఆఫర్ల కోసం చూస్తున్నారు. ఈ వారం సైతం మరో 4 కొత్త ఫండ్స్ లాంచ్ అవుతున్నాయి. కొత్త ఫండ్ల కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ ఫండ్స్ అన్నీ ఇండెక్స్ ఫండ్స్. వీటిని మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ తీసుకొస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.
న్యూ ఫండ్ ఆఫర్ ద్వారా వస్తున్న నాలుగు కొత్త స్కీమ్స్ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 29, 2024న ప్రారంభం కానుంది. వారం రోజులకుపైగా అవకాశం ఉంటుంది. నవంబర్ 6, 2024 వరకు సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతోంది. ఆ తర్వాత మళ్లీ క్రయ విక్రయాల కోసం ఈ ఫండ్స్ అన్నీ నవంబర్ 19వ తేదీన రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వస్తాయి. ఈ ఫండ్స్‌లో కనీస పెట్టుబడి రూ.500గా నిర్ణయించారు. లంప్‌సమ్ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకాలను స్వప్నిల్ మయెంకర్, రాకేశ్ శెట్టిలు నిర్వహిస్తారు.
ఈ జాబితాలో మోతిలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ ఐటీ అండ్ టెలికాం ఇండెక్స్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్‌స్మాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ స్మాల్ హెల్త్ కేర్ ఇండెక్స్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ స్మాల్ ఇండియా కన్జంప్షన్ ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్. తమ ఇన్వెస్టర్లకు మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ద్వారా హైరిటర్న్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ నాలుగు ఫండ్స్ లాంచ్ చేస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ వర్గాలు తెలిపాయి. ఐటీ, టెక్, టెలికాం, హెల్త్‌కేర్, ఫైనాన్షియల్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలు అందుకోవడమే ఈ ఫండ్స్ ముఖ్య ఉద్దేశంగా తెలిపింది. అయితే, మ్యూచువల్ ఫండ్స్‌లోనూ హైరిస్క్ అంటుందని మదుపరులు గమనించాలి. మనం ఎంచుకునే ఫండ్స్ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.