ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అరుదైన ఘనత సాధించింది. బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024గా నిలిచింది. ఈ మేరకు అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన దేశంలోనే అత్యుత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐని ఎంపిక చేసింది. అగ్రరాజ్య రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకుల సమావేశంలో భాగంగా 31వ వార్షిక ఉత్తమ బ్యాంకుల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఎస్‌బీఐకి బెస్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 పురస్కారాన్ని ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా 31వ వార్షిక ఉత్తమ బ్యాంకుల అవార్డుల కార్యక్రమానికి హాజరైన ఎస్‌బీఐ ఛైర్మన్ శ్రీ సీఎస్ శెట్టి ఈ అవార్డును అందుకున్నారు. గ్లోబల్ ఫైనాన్స్ అందిస్తున్న బెస్ట్ బ్యాంక్ అవార్డులు, వాటి విశ్వసనీయత, సమగ్రతలకు గుర్తింపుగా నిలుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బ్యాంకులను గుర్తించి ఈ అవార్డులు ఇస్తారు. కార్పొరేట్ ఫైనాన్స్ సెక్టార్‌లో గణనీయమైన విలువను కలిగి ఉండడం, అత్యుత్తమ కస్టమర్ సర్వీస్ అందించే వాటిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. భారత దేశం అంతటా ఆర్థిక స్వావలంబనను పెంపొందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంకితభావాన్ని గుర్తింపు లభించినట్లయింది. అసాధారణ సేవలు అందించి కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో ఎస్‌బీఐ ముందంజలో ఉందని బ్యాంక్ తెలిపింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు 22,500 బ్రాంచ్‌లు, 62 వేల ఏటీఎంలు ఉన్నాయి. అలాగే యోనో డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా భారతీయ బ్యాంకింగ్ సెక్టార్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 తొలి త్రైమాసికంలో ఈ బ్యాంకులో 63 శాతం కొత్త పొదుపు ఖాతాలు డిజిటల్ విధానంలోనే తెరిచారు. అలాగే ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్ యోనో యాప్ ద్వారా రూ.1,399 కోట్లుగా ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ప్రజలు ఎస్‌బీఐ బ్యాంకును ఎక్కువగా విశ్వసిస్తారు. ఈ బ్యాంకులో తమ డబ్బులు ఉంటే సురక్షితమని భావిస్తారు.