ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ల హవానే నడుస్తోంది. 10 రూపాయల ఛాయ్ దగ్గర్నుంచి.. వేల రూపాయల షాపింగ్ ఇలా ఏదైనా యూపీఐ ద్వారానే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని చెప్పొచ్చు. చాలా వరకు క్యాష్ అసలు క్యారీ చేయట్లేదంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫోన్ తీసి స్కానర్ ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ చేయడమే. చిటికెలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి. క్రమక్రమంగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుకుంటూ పోతూనే ఉన్నాయి. ఇంటర్నెట్ లేకున్నా.. పిన్ అవసరం లేకున్నా కూడా యూపీఐ పేమెంట్లు చేసేందుకు కొత్త కొత్త ఫీచర్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొస్తూనే ఉందని చెప్పొచ్చు. అయితే.. ఇప్పుడు దీపావళి పండగ సీజన్‌లో.. యూపీఐ పేమెంట్స్ ఊపందుకున్నాయి.
>> సంఖ్యా పరంగా మాత్రమే కాకుండా.. విలువ పరంగా కూడా యూపీఐ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తూనే ఉంది. అక్టోబర్ నెలలో ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంఖ్య 1658 కోట్లకు చేరినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ ట్రాన్సాక్షన్స్ విలువ రూ. 23.5 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది. అంతకుముందు ఎన్నడూ లేని విధంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు వృద్ధి చెందినట్లు వెల్లడించింది.
>> వార్షిక ప్రాతిపదికన చూస్తే.. యూపీఐ లావాదేవీల్లో సంఖ్యా పరంగా 45 శాతం వృద్ధి కనిపించగా.. విలువ పరంగా 34 శాతం పెరిగాయి. సెప్టెంబర్ నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంఖ్య 1500 కోట్లుగా నమోదైంది. కాగా.. ఇప్పుడు అక్టోబర్ నెలలో ఆ సంఖ్యను దాటేసింది. రోజువారీగా సగటు లావాదేవీలు సెప్టెంబర్ నెలలో 5 కోట్లుగా ఉండగా.. ఇప్పుడు అక్టోబర్ నెలలో చూస్తే ఆ సంఖ్య 5.35 కోట్లకు చేరింది.
>> మరోవైపు ఫాస్టాగ్, ఆటోమేటెడ్ టోల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ సంఖ్య 8 శాతం పెరిగి 34 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో ఐఎంపీఎస్ బ్యాంక్ ఆధారంగా జరిపే ఐఎంపీఎస్ లావాదేవీలు 5 శాతం తగ్గి 46 కోట్లుగా నమోదయ్యాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌వైపు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఎన్నో బ్యాంకులు ఈ సేవల్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. గతేడాదిలో యూపీఐ సేవల్ని అందిస్తున్న బ్యాంకుల సంఖ్య 492 గా ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 622 కు పెరిగింది.