తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు వారాంతాల్లో టీటీడీ ప్రాధాన్యం ఇస్తోంది. శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. గత శని, ఆదివారాల్లో రికార్డు స్థాయిలో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది. శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది. నారాయణగిరి షెడ్ల వద్ద ఇటీవలే ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్ తో భక్తులు క్యూలైన్ లో వేచి ఉండే సమయం తగ్గింది.
డిప్యూటీ ఈవోలు హరీంద్రనాథ్, లోకానాథం, రాజేంద్రలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఔటర్ క్యూలైన్లు, నారాయణగిరి షెడ్ల ను నిరంతరం పర్యవేక్షిస్తూ టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. క్యూలైన్లలోని భక్తులకు అల్పాహారం, పాలు, తాగు నీటిని 24 గంటలు పంపిణీ చేశారు. భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ జరుగనున్న కార్తీక బ్రహ్మోత్సవాల రోజువారి కార్యక్రమాల బుక్ లెట్ ను సోమవారం టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆవిష్కరించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఈవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 28వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు టీటీడీ ఈవో. డిసెంబరు 2వ తేదీ గజవాహనం, డిశెంబరు 3న బంగారు రథం, డిశెంబరు 5న రథోత్సవం, డిశెంబరు 6వ పంచమితీర్ధం వుంటుందని తెలిపారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవోలు గోవింద రాజన్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి.. 28-11-2024 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – చిన్నశేషవాహనం.. 29-11-2024 ఉదయం – పెద్దశేషవాహనం, రాత్రి – హంసవాహనం.. 30-11-2024 ఉదయం – ముత్యపుపందిరి వాహనం, రాత్రి – సింహవాహనం.. 01-12-2024 ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – హనుమంతవాహనం.. 02-12-2024 ఉదయం – పల్లకీ ఉత్సవం – వసంతోత్సవం, రాత్రి – గజవాహనం.. 03-12-2024 ఉదయం – సర్వభూపాల వాహనం – సాయంత్రం – స్వర్ణ రథం, రాత్రి -గరుడవాహనం.. 04-12-2024 ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం.. 05-12-2024 ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వ వాహనం.. 06-12-2024 ఉదయం – పంచమితీర్థం, రాత్రి – ధ్వజావరోహణం.