ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంబంధించిన మధ్యాహ్న భోజనం మెనూ మారిపోనుంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఒక్కటే మెనూ అమలు చేస్తుండగా.. వేర్వేరు ప్రాంతాల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మోనూ సిద్ధం చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇకపై మూడు నుంచి నాలుగు రకాల మెనూలు అమలు చేయాలని భావిస్తున్నారు.. వాస్తవానికి జిల్లాకో మెనూ అమలు చేయాలని అనుకున్నారు.. కానీ కొన్ని జిల్లాల్లో ఒకే విధమైన ఆహారపు అలవాట్లు ఉన్నందున జోన్‌కు ఒక మెనూ ఉండాలని నిర్ణయించారు.
మంగళగిరిలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రభుత్వ సూచనల ప్రకారం అన్ని జిల్లాల కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు ఇష్టపడే, పౌష్టికాహారం ఉండే భోజన మెనూలను తయారు చేశారు. ఈ మెనూలను వర్క్‌షాప్ స్టాల్స్‌లో ప్రదర్శించగా.. అధికారులు రుచి చూశారు. జాతీయ స్థాయి నిపుణులతో మధ్యాహ్న భోజనంపై తుది నిర్ణయానికి పాఠశాల విద్యాశాఖ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలిసి స్టాల్స్‌ను పరిశీలించారు.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉడికించిన గుడ్లు తినేందుకు విద్యార్థులు ఇష్టపడట్లేదని వర్క్‌షాప్‌లో అధికారుల దృష్టికి రాగా.. వారికి గుడ్లనే ప్రత్యామ్నాయ పద్ధతిలో పెట్టాలని నిర్ణయించారు. ఇక మధ్యాహ్న భోజనం మెనూలో నుంచి హాట్ పొంగల్‌ను పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. ఈ మూడు నుంచి నాలుగు మెనూలను మరోసారి ప్రభుత్వం ముందుంచి ఫైనల్ చేయనున్నారు.. డిసెంబరు 1 నుంచి కొత్త మెనూలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇప్పటి వరకు అమలు చేస్తున్న మెనూలో పోషకాలు ఎంత వరకు ఉంటున్నాయి అనేది తెలుసుకునేందుకు ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. కొన్నింటిని పిల్లలు ఎందుకు ఆసక్తిగా తినడం లేదనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ వర్క్‌షాప్ కోసం ఒక్కో జిల్లా నుంచి ఆరుగురు చొప్పున పాఠశాలల్లో వంట చేసేవారిని తీసుకొచ్చి, ప్రాంతాల వారీ వంటకాలతో మెనూ తయారు చేయించారు. ఆ వంటల్ని రుచి చూశారు.
రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకానికి ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే.. కేంద్రం తన వాటా కింద రూ.400 కోట్లు ఇస్తోందన్నారు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో కూరగాయల లభ్యతను కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. అందుకు తగిన విధంగా మధ్యాహ్నం భోజనం మెనూలు తయారు చేస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజనం విద్యార్థుల డ్రాపౌట్ రేటును తగ్గించేందుకు ఉపయోగపడుతుందన్నారు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు.