మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ (మంళవారం) జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు తమ సమస్యలను మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య, మాజీ శాసనమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్, బుచ్చిరాంప్రసాద్‌లకు విన్నవించుకున్నారు.‘‘నా వద్ద ఐదు కార్లను రెంట్‌కు తీసుకుని కడప జిల్లా వేంపల్లి మెడికల్ కాలేజీలో ఉద్యోగుల డ్రాపింగ్, పికప్‌ల కోసం పెట్టి నన్ను మోసగించిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై కేసుపెట్టాను. పోలీసులు విచారణ జరిపి అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా కార్ల జాడను కనుక్కుని వేంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురాగా.. అక్కడి ఎస్సై తిరుమల నాయుడు మరుసటి రోజు వచ్చి కార్లను తీసుకెళ్లమని తేరగా చెప్పాడు. పొద్దునే పోలీస్ స్టేషన్‌కు వెళితే కార్లు అక్కడ లేవు. వాటిని ఎక్కడ నుంచి తెచ్చామో అక్కడికే పంపించాం. వెళ్లి వారితో మాట్లాడమని నన్ను వైసీపీ నేతల వద్దకు పంపారు. అక్కడ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు శంకర్ రెడ్డి, ప్రసాద్, వైసీపీ జడ్పీటీసీ రవికుమార్ నన్ను బాగా కొట్టారు. ఇడుపులపాయలోని వారి రిసార్ట్‌లో ఐదు రోజులపాటు బంధించి చిత్రహింసలు పెట్టారు ఎలాగోలా తప్పించుకుని బ్రతికి బయటపడ్డాను. రెండు నెలల క్రితం నా కార్లు అవినాష్ రెడ్డి కాన్వాయ్‌లో ఉన్నాయి. కావున దయ చేసి ఏపీ పోలీసులు నాకు న్యాయం చేయాలి’’ అని కన్నీటి పర్యంతం అవుతూ తెలంగాణ సంగారెడ్డికి చెందిన టి. సతీష్ కుమార్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు.అర్జీని స్వీకరించిన మంత్రి ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ నేతలు న్యాయం చేస్తామని బాధితుడికి హామీ ఇచ్చారు. వెంటనే కడప జిల్లా ఎస్పీతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధితుడి కార్లను అతడికి ఇప్పించి నిందితులపై కేసులు పెట్టి.. తప్పుడు పనులకు సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.బాలిక పట్ల ఎదురింటి తాగుబోతు అసభ్యకర ప్రవర్తనవిజయవాడ రాజరాజేశ్వరి పేటకు చెందిన 12 ఏళ్ల బాలిక పట్ల ఎదురింటి తాగుబోతు (గంజాయి) అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ‘‘మీ అమ్మ పిలుస్తుంది రమ్మని చెప్పి బాలికను ఇంటి మేడ పైకి తీసుకెళ్లి ముట్టుకోకూడని చోట ముట్టుకుంటూ నీచమైన పనులు చేశాడు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే స్థానిక పోలీసులు పట్టించుకోక పోగా ఫిర్యాదు చేసిన నా పట్ల నీచంగా ప్రవర్తించారు’’ అని బాలిక తల్లి వాపోయింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లడంతో తాగుబోతు వ్యక్తి అతడి అమ్మ దాడులకు తెగబడ్డారని పేర్కొంది. అంతేకాకుండా ఆ తాగుబోతు వ్యక్తి ప్రతిరోజు ఆ మహిళ ఇంట్లోకి వచ్చి బాలికతో పాటు మహిళ పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ అత్యాచార యత్నానికి ఒడిగడుతున్నాడని, అతడిని కఠినంగా శిక్షించాలని కోరింది. మహిళల పట్ల దిగజారి ప్రవర్తించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి ఉద్యోగం నుంచి పూర్తిగా తొలగించాలని బాధిత మహిళ గ్రీవెన్స్‌లో భోరుమని విలపించింది.వైసీపీ నేతలకు సహకరిస్తూ తమ భూమిని అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువు బీఆర్సీ బుగ్గారెడ్డికి అక్రమంగా రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్ చేశారని నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోరుకల్లు గ్రామానికి చెందిన సురేష్ బాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపై నాడు ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరించారని, అక్రమంగా ఆన్‌లైన్ చేసిన 14 సెంట్లను రద్దు చేసి, ఈ అక్రమాలకు సహకరించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.అప్పు తిరిగివ్వమంటే బెదిరిస్తున్నారుఅప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని చింతల చెరువు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడని విజయవాడకు చెందిన యక్కంటి కృష్ణారెడ్డి అనే వ్యక్తి వాపోయాడు. అవసరం అంటే ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి రూ.32 లక్షలు అప్పుగా ఇచ్చానని, ఇప్పుడు డబ్బులు ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకోమంటున్నాడని, వెంకటేశ్వరరెడ్డి నుంచి తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని కోరాడు.నా భార్యను ఇండియాకు తీసుకురండి..పని చూపిస్తానని తన భార్యను మస్కట్ తీసుకెళ్లి అక్కడ పని కల్పించకుండా, తిండి పెట్టకుండా ఏజెంట్ ఇబ్బంది పెడుతున్నాడని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన టీ రాజశేఖర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన భార్యను ఇండియాకు తిరిగి పంపించమని అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని, ఏజెంట్ మల్లీడి సుబ్రహ్మణ్యంపై పాలకొల్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. తల్లికోసం పిల్లలు బెంగ పెట్టుకున్నారని, అంతేకాకుండా మస్కట్‌లో ఉన్న తన భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని అతడు విన్నవించుకున్నాడు. తనను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని విజ్ఞప్తి చేశాడు.