వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు భారీ ఊరట దక్కింది. ఆయన విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఆయన తన పాస్‌పోర్ట్‌ను తీసుకుని సింగపూర్ వెళ్లనున్నారు. తాను సింగపూర్ వెళ్లేందుకు బెయిల్ షరతుల్ని సడలించాలని ఇటీవల పిన్నెల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. కోర్టు విచారణ జరపగా.. ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. ఇవాళ తీర్పును వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు (మే 13న) పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేటులో తన అనుచరులతో.. పోలింగ్ కేంద్రంలోకి చొరబడిన పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అడ్డుకునే యత్నం చేసిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేశారు. ఆ తర్వాత రోజు కారంపూడిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయగా.. సీఐ నారాయణస్వామికి గాయాలయ్యాయి. ఈ వరుస ఘటనలపై రెంటచింతల, కారంపూడి పోలీసులు రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయగా.. అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు తరలించారు. పోలీసులు కస్టడీకి తీసుకుని ఆయన్ను ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ కేసుల్లో హైకోర్టు షరతులతో కూడి బెయిల్ మంజూరు చేసింది. పాస్ పోర్టు అప్పగించాలని, ప్రతివారం పోలీస్ స్టేషన్లో హాజరై సంతకం పెట్టాలని కోర్టు ఆదేశించింది.
అయితే తాను సింగపూర్ వెళ్లాలని.. హైకోర్టు బెయిల్ షరతుల్ని సడలించాలని కోరారు. తాను విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్ట్ అప్పగించాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది.. వివిధ కేసులలో నిందితుడిగా ఉండి విదేశాలకు పారిపోయిన తన సోదరుడు వెంకట్రామిరెడ్డిని కలిసేందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిలు షరతులను సడలించాలని కోరుతున్నారని పోలీసుల తరఫున లాయర్లు వాదించారు. అదే సమయంలో పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బెయిల్ రద్దు కోసం దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఆయనకు (పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి) నోటీసులు ఇవ్వడానికి అందుబాటులో లేరని.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నేర చరిత్ర ఉందని..బెయిలు షరతును సడలించవద్దని హైకోర్టును కోరారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన కుమారుడి చదువు నిమిత్తం సింగపూర్ వెళ్లాల్సి ఉందని లాయర్ వాదనలు వినిపించారు. బెయిల్ షరతుల్ని సడలించి.. మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించిన పాస్‌పోర్టును తిరిగి ఇప్పించాలని కోరారు. హైకోర్టు బెయిల్ షరతుల్లో వారంలో ఓసారి దర్యాప్తు అధికారి ముందు హాజరవ్వాలని ఉందని.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు వెళ్లాలి కాబట్టి ఆ షరుతును సడలించాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్‌కే కృపాసాగర్.. తీర్పును వాయిదా వేశారు. ఇవాళ బెయిల్ సడలింపులకు సంబంధించి కీలక ఆదేశాలు ఇచ్చారు. మొత్తానికి పిన్నెల్లికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది.