దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థపై గట్టి నిఘా పెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ). బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారితనాన్ని బలోపేతం చేసేందుకు గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మానీటరీ పాలసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై చర్యలు తీసుకుంటోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీగా జరిమానాలు విధిస్తోంది. కొన్ని సార్లు లైసెన్సులు సైతం రద్దు చేసిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా మరో బ్యాంకుకు షాకిచ్చింది. మానీటరీ పాలసీ నిబంధనలు పాటించడంలో విఫలమైందన్న కారణంతో భారీగా జరిమానా విధించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
డిపాజిట్లు, కస్టమర్ సేవలకు సంబంధించిన నిబంధనలు పాటించడంలో విఫలమైందన్న కారణంతో సౌత్ ఇండియా బ్యాంకుకు భారీగా జరిమానా విధించింది రిజర్వ్ బ్యాంక్. రూ.59.20 లక్షల పెనాల్టీ కట్టాలని ఆదేశించింది. గత ఏడాది మార్చి 31, 2023 వరకు బ్యాంక్ ఆర్థిక పరిస్థితి, కస్టమర్ సేవలు, రుణాల మంజూరు వంటి వాటిపై తనిఖీలు నిర్వహించింది. ఈ క్రమంలో మానీటరీ పాలసీ నిబంధనలు పాటించకపోవడం, రుణ వితరణలో అవకతవకల వంటివి గుర్తించినట్లు పేర్కొంటూ సౌత్ ఇండియన్ బ్యాంకుకు నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ నోటీసులకు బ్యాంక్ ఇచ్చిన సమాధానం సరిగా లేదని, రూ.59 లక్షల పెనాల్టీ విధించింది.
ఖాతాదారులపై ప్రభావం ఉంటుందా?
చాలా మంది కస్టమర్లకు ఎస్ఎంఎస్, ఇ-మెయిల్ లేదా లెటర్ ద్వారా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించలేదనే కారణంతో జరిమానాలు విధించినట్లు ఆర్‌బీఐ గుర్తించింది. కస్టమర్లకు సమాచారం ఇవ్వకుండా ఖాతాల నుంచి డబ్బులు కట్ చేయడాన్ని తప్పుబట్టింది. అందుకే పెనాల్టీలు విధించాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో తెలిపింది. చట్టబద్ధమైన, నియంత్రమ పరమైన సమ్మతి లోపాలపై ఈ పెనాల్టీ ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అయితే, బ్యాంకులో ఖాతా ఉన్న వారిపై అంటే బ్యాంక్ తన కస్టమర్లతో కుదుర్చుకున్న ఏదైనా ఒప్పందం లేదా లావాదేవీల చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపింది. తమ చర్యలు కస్టమర్ సర్వీసులను ప్రభావితం చేయడం ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ కార్యకలాపాలు ఎప్పటిలాగా సాధారణంగానే కొనసాగుతాయని పేర్కొంది.