దళితులు పేదలుగానే మిగిలిపోవాలా?, వారికి భూములిస్తే మీకెందుకు కడుపు మంట? అంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్నా, వాటిపై ఏ హక్కులు లేక, ఇబ్బందులు పడుతున్న లక్షలాది రైతులకు మేలు చేస్తూ, వైయస్ జగన్‌గారి ప్రభుత్వం నిషేధిత జాబితా 22–ఏలో ఉన్న భూములను, ఆ ఆంక్షల నుంచి తొలగించిందన్నారు. గత ఎన్నికల ముందు రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లకు చేరిందని ఏ విధంగా దుష్ప్రచారం చేశారో.. ఇప్పుడు భూముల విషయంలోనూ అలాగే కొత్త డ్రామాకు తెర తీశారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.... ‘పేదలకు మాటలు. కూటమి నాయకులకు మూటలు. వైయస్ఆర్‌సీపీ నాయకులకు కేసులు’.. అన్నట్లుగా ఉంది కూటమి నాయకుల వ్యవహారం.
దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్నా, వాటిపై ఏ హక్కులు లేక, ఇబ్బందులు పడుతున్న లక్షలాది రైతులకు మేలు చేస్తూ, జగన్‌గారి ప్రభుత్వం నిషేధిత జాబితా 22–ఏలో ఉన్న భూములను, ఆ ఆంక్షల నుంచి తొలగించింది. చుక్కల భూములు, అసైన్డ్, ఇనాం భూములు, సర్వే ఇనాం, షరతులతో కూడిన పట్టా భూముల విషయంలో నిపుణుల సలహాలతో వారి సూచనల మేరకు, రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించారు.పేదలకు భూములపై హక్కు కల్పిస్తే ప్రభుత్వానికి ఎందుకు కడుపు మంట?. తమకు మాత్రమే మూటలు అన్నట్లుగా, మంత్రి అనగాని సత్యప్రసాద్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 27 వేల ఎకరాలు అసైన్డ్ భూములు రిజిస్టర్ అయ్యాయంటే ఆయనకు ఎందుకు కడుపుమంట?. పేదలు ఎప్పటికీ అలాగే ఉండాలా?. విచిత్రంగా ఇలాంటి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మాట్లాడుతున్నారు. ఈ భూమి పేదవారి వద్దనే ఉంటే వాటిని అడ్డుకోవడానికి ఇలాంటి విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అని మండిపడ్డారు.