ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై నేరాలు జరుగుతున్నాయని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళలపై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు.
ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.