టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నేడు ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం అవకాశం కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ నిర్ణయం తిరుపతి ప్రజలకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలిపారు. టీటీడీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర పాలకమండలి సభ్యులకు అభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం విషయాన్ని తిరుపతి ప్రజలు ఎన్నికల సమయంలో తన దృష్టికి తీసుకువచ్చారని, ఇప్పుడు టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పవన్ పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను పరిరక్షించే దిశగా ఆలోచనలు చేస్తూ, ఆ మేరకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వివరించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.