పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాకు చెందిన ఓ బిచ్చగాడి కుటుంబం... తమ నానమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన విందు కోసం అక్షరాలా 1.25 కోట్ల రూపాయలను (పాకిస్థాన్ కరెన్సీ) ఖర్చు చేసింది. ఈ విందులో 20 వేల మందికి పైగా భోజనం పెట్టింది. గుజ్రాన్‌వాలాలోని రాహ్‌వలి రైల్వే స్టేషన్ సమీపంలో ఇటీవల ఈ విందును ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బిచ్చగాడు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విందు ఏర్పాటు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.పంజాబ్ ప్రావిన్స్‌లోని ఈ ప్రాంతంలో ఇటీవల బిచ్చగాడి నానమ్మ చనిపోయింది. 40వ రోజు ఆమె జ్ఞాపకార్థం భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు తమకు తెలిసిన వారందరినీ ఆహ్వానించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది వచ్చారు.మరో ఆసక్తికర అంశం ఏమంటే అతిథులను వేదిక వద్దకు తరలించేందుకు దాదాపు 2 వేల వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ విందులో వారి సంప్రదాయ వంటకాలైన సిరి పాయా, మురబ్బాలతో పాటు మాంసాహారం ఉండేలా చూసుకున్నారు. మటన్, స్వీట్ రైస్ కూడా పెట్టారు. ఈ విందు కోసం 250 మేకలను వధించినట్లుగా కథనాలు వచ్చాయి.