దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి మరో షాక్ తగిలింది. లారెన్స్ బిష్ణోయ్ జైలులో ఉన్నా.. విదేశాల నుంచి అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, ఫ్రెండ్ గోల్డీ బ్రార్‌లు కలిసి గ్యాంగ్‌ను నడిపిస్తున్నారు. వీరిద్దరే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు పంపడం, అతని ఇంటి ముందు కాల్పులు జరిపిన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అంతేకాకుండా ఇటీవల హత్యకు గురైన మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యలోనూ వీరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అన్మోల్ బిష్ణోయ్‌ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్ అయినట్లు సమాచారం.
భారత్‌లో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వ్యవహారాలు చూడడం, సెలబ్రిటీలను బెదిరించడం, హత్యలు చేయడంలో కీలక నిందితుడిగా అన్మోల్ బిష్ణోయ్ ఉన్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన, బాబా సిద్ధిఖీ హత్య, 2022లో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అన్మోల్ బిష్ణోయ్ ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడు. ఇక ముంబైలో జరిగిన బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితులతో అన్మోల్ బిష్ణోయ్ టచ్‌లో ఉన్నట్లు ముంబై పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే విదేశాల్లో ఉంటున్న అన్మోల్ బిష్ణోయ్‌ని అరెస్ట్ చేసేందుకు.. భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అతడ్ని భారత్‌కు రప్పించే ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే ముంబై పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ తరఫున అన్మోల్ బిష్ణోయ్ పలు చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో భాగం అయ్యాడని పోలీసులు అందులో వెల్లడించారు. దీంతో అన్మోల్ బిష్ణోయ్‌పై స్పెషల్ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఈ క్రమంలోనే అన్మోల్ బిష్ణోయ్ కదలికల గురించి అమెరికా అధికారులు ముంబై పోలీసులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలోనే అన్మోల్ బిష్ణోయ్ తాజాగా కాలిఫోర్నియాలో అరెస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుంది. ఇక ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను అతడి స్నేహితుడు గోల్డీ బ్రార్‌ను కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.