ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తమ వినియోగదారులకు అదిరే శుభవార్త అందించింది. దేశవ్యాపాతంగా తమ రిటైల్ స్టోర్లను ఒక్కసారిగా పెంచేందుకు సిద్ధమైంది. ఓలా సర్వీసుల్లో తీవ్ర జాప్యం ఏర్పడుతుందన్న కస్టమర్ల ఆందోళనల నడుమ పెద్ద ఎత్తున షోరూమ్ కమ్ సర్వీసింగ్ సెంటర్లను ప్రారంభిస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ నెలాఖరు కల్లా 4 వేల షోరూములు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న 800 షోరూములను 4 వేలకు పెంచనున్నట్లు ఆ కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
' ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి సంబంధించి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న 800 స్టోర్లను 4 వేలకు పెంచుతున్నాం. మా వినియోగదారులకు మరింత చేరువకావడమే దీని లక్ష్యం. డిసెంబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని షోరూములను ఒకేసారి ప్రారంభించబోతున్నాం. బహూశా ఈ స్థాయిలో స్టోర్లను ప్రారంభించడం ఇదే తొలిసారి కావచ్చు.' అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీశ్ అగర్వాల్. కొత్తగా అందుబాటులోకి వచ్చే స్టోర్లలో ఓలా సర్వీసులూ లభిస్తాయని స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ టూవీలర్ల మార్కెట్‌లో లీడర్‌గా కొనసాగుతోంది ఓలా ఎలక్ట్రిక్. అయితే అదే స్థాయిలో ఓలా సర్వీసులపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఓలా సర్వీసుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌కు 10 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ విచారణకు ఆదేశించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో స్టోర్లు ప్రారంభిస్తున్నామని కంపెనీ నుంచి ప్రకటన వచ్చింది.
ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ షేర్లు రాణించాయి. సోమవారం ఉదయం నష్టాల్లోకి జారుకున్నప్పటికీ సీఈఓ భవీశ్ అగర్వాల్ ప్రకటన చేసిన తర్వాత ఒక్కసారిగా కొనుగోళ్ల మద్దతు లభించింది. 1.40 గంటల ప్రాంతంలో దాదాపు 5 శాతం లాభంతో ఓలా షేర్లు రూ.91.67 వద్ద ట్రేడయ్యాయి. ఈ వార్త రాసే సమయానికి అంటే 2.45 గంటల ప్రాంతంలో 6.11 శాతం లాభంతో 92.84 వద్ద ట్రేడవుతోంది.