ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంక్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించినట్లు ప్రకటించింది. సవరించిన కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లను డిసెంబర్ 1వ తేదీ నుంచే అమలులోకి తీసుకొచ్చింది. దీంతో గరిష్ఠంగా 7.90 శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. మరి గరిష్ఠ వడ్డీ గల టెన్యూర్‌లో రూ.5 లక్షల జమ చేస్తే ఎంతొస్తుంది? లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? అనేది తెలుసుకుందాం.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన కెనరా బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. రూ.3 కోట్ల లోపుఉండే రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వడ్డీ రేట్లను సవరించినట్లు తెలిపింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం సవరించిన కొత్త వడ్డీ రేట్లను డిసెంబర్ 1, 2024 నుంచే అమలులోకి తీసుకొచ్చింది. ఈ సవరణ తర్వాత కెనరా బ్యాంక్ జనరల్ పబ్లిక్‌కు 4 శాతం నుంచి 7.40 శాతం మేర వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.90 శాతం వడ్డీ అందిస్తోంది.
కెనరా బ్యాంక్ లేటెస్ట్ వడ్డీ రేట్లు..
కెనరా బ్యాంకులో 7 రోజుల నుంచి 45 రోజుల టెన్యూర్ బ్యాంక్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 4 శాతం వడ్డీ ఇస్తోంది.
46 రోజుల నుంచి 90 రోజుల డిపాజిట్లకు 5.25 శాతం, 91 రోజుల నుంచి 179 రోజులకు 5.5 శాతం వడ్డీ ఇస్తోంది.
180 రోజుల నుంచి 269 రోజులకు 6.25 శాతం, 270 రోజుల నుంచి ఏడాదిలోపు డిపాజిట్లకు 6.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
ఒక సంవత్సరం టెన్యూర్ గల డిపాజిట్లపై 6.85 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
ఇక 444 రోజుల స్పెషల్ టెన్యూర్ డిపాజిట్ స్కీమ్ ద్వారా 7.25 శాతం వడ్డీ అందిస్తోంది.
ఏడాది నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లకు 6.85 శాతం, 2 ఏళ్ల నుంచి మూడేళ్లలోపు 7.30 శాతం వడ్డీ అందిస్తోంది.
ఇక మూడేళ్ల నుంచి 5 ఏళ్లలోపు డిపాజిట్లపై గరిష్ఠంగా 7.40 శాతం వడ్డీ ఇస్తోంది. ఇదే డిపాజిట్లపై సీనియర్ సిటిజనన్లకు 7.90 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
5 ఏళ్ల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ డిపాజిట్లపై 6.70 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతోస్తుంది?
కెనరా బ్యాంకులో ప్రస్తుతం మూడేళ్ల నుంచి 5 సంవత్సరాల మధ్య టెన్యూర్ డిపాజిట్లపై గరిష్ఠ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది. జనరల్ పబ్లిక్‌కు 7.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీ అందిస్తోంది. ఇందులో ఒక సాధారణ కస్టమర్ రూ. 5 లక్షలు జమ చేస్తే 5 సంవత్సారల తర్వాత చేతికి అసలు, వడ్డీతో మొత్తం రూ. 6,84,900 వరకు వస్తాయి. ఇక సీనియర్ సిటిజన్లు రూ. 5 లక్షలు జమ చేస్తే 5 ఏళ్ల తర్వాత చేతికి రూ. 6,97,400 వరకు లభిస్తాయి.