ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభం కాకున్నా.. అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ముందస్తుగానే అన్ని విధాలుగా సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఆప్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే 2 విడతలుగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆప్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. తాజాగా ఆటో డ్రైవర్లకు ఐదు గ్యారెంటీలను ప్రకటించింది. జీవిత బీమా, ప్రమాద బీమాతోపాటు ఆటో డ్రైవర్ల కుమార్తెల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం కూడా అందిస్తామని.. ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా వెల్లడించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అరవింద్ కేజ్రీవాల్.. ఒక సాధారణ ఆటో డ్రైవర్ నివాసానికి భోజనానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్లపై వరాల జల్లు కురిపించారు. ఆటో డ్రైవర్ల కోసం కేజ్రీవాల్ ఐదు హామీలు ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మళ్లీ గెలిచి.. అధికారంలోకి రాగానే ఆటో డ్రైవర్ల కుమార్తెల పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం ఇస్తామని తెలిపారు. అదే విధంగా ప్రతి ఏడాది దీపావళి, హోలీ పండగలకు రూ.2500 అందించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఒక్కో ఆటోడ్రైవర్‌కు జీవిత బీమా, ప్రమాద బీమా కల్పిస్తామని హమీ ఇచ్చారు. ఒక్కొక్కరికీ రూ.10 లక్షల జీవిత బీమా.. రూ.5 లక్షల ప్రమాద బీమా చేయించనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.
ఇక ఆటో డ్రైవర్ల పిల్లలు ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే.. వారికి సంబంధించిన ఫీజులను ఢిల్లీ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పూచో యాప్‌ను కూడా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అయితే సోమవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో కొందరు ఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా అందులో ఉన్న ఓ ఆటో డ్రైవర్.. కేజ్రీవాల్ తమ ఇంటికి భోజనానికి రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఆ ఆటో డ్రైవర్ విజ్ఞప్తి మేరకు మంగళవారం ఉదయం ఆ ఆటో డ్రైవర్ ఇంట్లో కేజ్రీవాల్ భోజనం చేశారు. తన సతీమణి సునీతా కేజ్రీవాల్‌తో కలిసి.. తన ఇంటికి వచ్చిన కేజ్రీవాల్ దంపతులకు ఆటో డ్రైవర్ కుటుంబం ఘనంగా స్వాగతం పలికింది.
ఇక అందరికంటే ముందే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అధికార ఆప్ సమాయత్తం అయింది. ఈ సమయంలోనే దూకుడు పెంచిన ఆమ్ ఆద్మీ పార్టీ.. షెడ్యూల్ ఎప్పుడు అని తెలియకముందే ఇప్పటికే రెండు విడతల్లో 31 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 70 అసెంబ్లీ సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి 2025 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆప్‌తో పాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికల బరిలో పోటీలో ఉండగా.. ఆప్-బీజేపీ మధ్యే రసవత్తరమైన పోరు జరగనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకుంది.