విజయవాడలో 17ఏళ్ల మైనర్ బాలిక వ్యవహారం పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మునుపెన్నడూ ఈ తరహా కేసుల్ని చూసి ఉండకపోవడంతో పోలీసులే షాక్ తిన్నారు. కేసు దర్యాప్తులో ప్రారంభంలో పోలీసులకు కేసు మిస్టరీ అర్థం కాక తలలు పట్టుకున్నా చిక్కుముడి వీడిన తర్వాత బుర్రలు వేడెక్కిపోయాయి. మారుతున్న సమాజ పరిణామాలు, కుటుంబ విలువలు, సాంకేతిక పరిజ్ఞానం చిన్నారుల మెదళ్లను కలుషితం చేస్తున్న తీరు తెలిసి తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసును ఎలా పరిష్కరించాలో తెలియక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.బాలికకు ఐదు నెలలు నిండటంతో న్యాయస్థానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఏం జరిగిందంటే... విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన బాలిక తరచూ అస్వస్థతకు గురవుతుండటంతో కొద్ది రోజుల క్రితం ఆమె తండ్రి ఆస్పత్రిలో పరీక్షలు జరిపించడంతో ఆమె గర్భవతిగా తేలింది. అప్పటికే ఐదు నెలల గర్భం కావడంతో ఆయనకు ఏమి చేయాలో దిక్కుతోచలేదు. ఎలా జరిగిందనే ప్రశ్నలకు బాలిక కూడా సమాధానం చెప్పలేదు. పోలీసులు బాలికను ఎంత ప్రశ్నించినా తనకు తెలియదని, గుర్తు తెలియని వ్యక్తులు కళ్లకు గంతలు కట్టి అత్యాచారం చేశారని మాత్రమే పదేపదే చెబుతూ వచ్చింది. దీంతో తన కూతురిపై ఎవరో అత్యాచారం చేయడం వల్ల గర్భం దాల్చిందని బాలిక తండ్రి మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కూడా బాలిక అదే చెబుతూ వచ్చింది. విచారణలో భాగంగా బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఐదు నెలల గర్భం కావడంతో పరిస్థితిని న్యాయ స్థానం ముందుంచారు. బాలిక మైనర్ కావడంతో గర్భవిచ్చిత్తికి అనుమతి కోసం దరఖాస్తు చేశారు. గుట్టువిప్పిన కానిస్టేబుల్.. ఈ క్రమంలో బాలికతో పాటు విచారణకు మహిళా కానిస్టేబుళ్లు ఎస్కార్ట్ వెళుతు న్నారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ బాలికను బుజ్జగించి, గట్టిగా అదిలించి అసలు విషయం రాబట్టారు. ఆమె గర్భం దాల్చడానికి కారణమెవరో తెలియడంతో తెలిసి పోలీసులే నిర్ఘాంతపోయారు. తెలిసి తెలియని వయసులో బాలిక ఏమి చేసిందో వివరించేసరికి అవాక్కయ్యారు. ఈ కేసు వివరాలను ఉన్నతాధికారుల నివేదించారు. బాలిక గర్భం దాల్చడానికి సోదరుడి వరుసయ్యే మరో మైనర్ బాలుడిగా గుర్తించారు. బాధిత బాలిక పిన్ని కొడుకు వల్ల గర్భం దాల్చినట్టు నిర్ధారణకు వచ్చారు. బాలిక వయసు 17ఏళ్లైతే బాలుడి వయసు 14ఏళ్లు కూడా లేవు. బాధిత బాలికకు వరుసకు తమ్ముడే గర్భం దాల్చడానికి కారణమని బాలిక పోలీసులకు వివరించింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యంతో జరిగినట్టు వివరించింది. ఈ విషయం తన తల్లికి తెలుసని కుటుంబంలో కలతలు వస్తాయని ఎవరికి చెప్పొద్దనడంతో అత్యాచారం కథ చెప్పినట్టు వివరించింది. దీంతో పోలీసులు మైనర్ బాలుడిపై కూడా కేసు నమోదు చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని కోర్టుకు నివేదించిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకోనున్నట్టు పోలీసులు వివరించారు. తల్లిదండ్రులదే బాధ్యత.. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోతే ఏమి జరుగుతుందో ఈ ఘటనే నిదర్శనమని పోలీసులు చెబుతున్నారు. 14ఏళ్ల లోపు వయసున్న బాలుడి వల్ల మైనర్ బాలిక గర్భం దాల్చడం, అది కూడా సోదరి వరుసయ్యే బాలికతో లైంగిక చర్యలకు తల్లిదండ్రులదే బాధ్యత అని చెబుతున్నారు. పిల్లలకు విచ్చలవిడిగా అందుబాటులో వస్తున్న అడల్ట్ కంటెంట్, పోర్నోగ్రఫీ ఇలాంటి సమస్యలకు కారణమని ఓ పోలీస్ అధికారి వివరించారు. పిల్లల్ని అతి గారాబం చేయడం వారి చేతికి మొబైల్ ఫోన్లు ఇచ్చేసి వదిలేస్తే జరిగే పర్యావసానాలు ఇలాగే ఉంటాయని చెబుతున్నారు.