క్రిస్మస్ మార్కెట్లో కారు బీభత్సం సృష్టించింది. పండుగ నేపథ్యంలో రద్దీగా ఉన్న మార్కెట్లోకి బారికేడ్లను తోసుకుంటూ ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 60 మంది గాయపడ్డారు. ఈ ఘటన జర్మనీలోని మగ్డాబర్గ్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మార్కెట్లోకి దూసుకొచ్చిన కారు నడిపిన అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని సౌదీ అరేబియాకు చెందిన 50 ఏళ్లు వైద్యుడిగా గుర్తించారు. అనుమానితుడు సక్సోనా-అన్హాల్ట్లో నివాసం ఉన్నట్టు తెలిపారు. అతడు 2006 నుంచి జర్మనీలో ఉంటున్నట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు, ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిని పోలీసులు కొట్టిపారేశారు. ‘ప్రస్తుతం మాకు తెలిసిన దాని ప్రకారం అనుమానుతుడ్ని అదుపులోకి తీసుకున్నాం.. దీని వెనుక ఇంకేమైనా కుట్ర ఉందని మేము భావించడం లేదు’ అని తెలిపారు. బారికేడ్ల దాటుకుంటూ వచ్చిన కారు 400 మీటర్ల మేర జనాలను తొక్కుకుంటూ ముందుకెళ్లింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లతో చేరుకున్నారు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించారు. ఆ ప్రాంతంలో ఆర్దనాదాలు, హహాకారాలతో దద్దరిల్లింది. క్రిస్మస్ ట్రీస్, లైట్లుతో కోలహాలంగా ఉన్న మార్కెట్లో ప్రమాదంతో బీతావాహ వాతావరణం నెలకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనుమానితుడు మ్యూనిచ్ నెంబరు ప్లేటు ఉన్న బీఎండబ్ల్యూ కారును అద్దెకు తీసుకుని.. మార్కెట్కు వచ్చినట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
కారులో లగేజ్ బ్యాగును గుర్తించినట్టు స్థానిక మీడియా పేర్కొంది. అయితే, అది పేలుడు పదార్థమా? కాదా? అనేది స్పష్టత లేదు. దీనిని ఇంకా అధికారులు ధ్రువీకరించలేదు. గాయపడినవారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని, 37 మంది తీవ్రంగా గాయపడ్డారని, 16 మందికి స్వల్ప గాయాలైనట్టు మాగ్డబర్గ్ అధికార యంత్రాంగం తెలిపింది. ప్రమాదంపై జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ ష్కాల్జ్ ట్విట్టర్లో స్పందించారు. బాధితులు, వారి కుటుంబాలకు తన సానుభూతి తెలిపిన ఆయన.. వారికి అండగా ఉంటామని తెలిపారు.