సినీ నటుడు అల్లు అర్జున్, సీఎం రేవంత్ రెడ్డి ఎపిసోడ్‌పై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు.. కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమైతే.. ఆయనతో తాను ఏకీభవిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని విష్ణుకుమార్ రాజు చెప్పారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చాలా మంది ప్రముఖులు ఆయనను పరామర్శించారన్న విష్ణుకుమార్ రాజు.. బాధిత మహిళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. చట్టం సామాన్యులకు ఒకలా, ప్రముఖులకు మరోలా ఉండదని అభిప్రాయపడ్డారు. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా చట్టం ముందు అందరూ సమానమేనని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.
మరోవైపు బెనిఫిట్ షోల మీద విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బెనిఫిట్ షోలు ఆపేయాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఒకవేళ బెనిఫిట్ షోలు వేయాలని అనుకున్నప్పడు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. బెనిఫిట్ షోలకు అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉందని.. ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరగకూడదంటే బెనిఫిట్ షోలు రద్దుచేస్తేనే మంచిదన్నారు. అలాగే సెలబ్రిటీలు ఏదైనా కార్యక్రమానికి హాజరు కావాలని అనుకున్నప్పుడు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిందని తెలియగానే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ నుంచి వెళ్లిపోవాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు అల్లు అర్జున్, రేవంత్ రెడ్డి ఎపిసోడ్ గురించి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వారి వ్యక్తిగతమని విష్ణుకుమార్ రాజు చెప్పారు. అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా సరికాదన్నారు. అల్లు అర్జున్ ఘటన మీద కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్.. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సమయంలో.. అందుకు విరుద్ధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తాను ఏకీభవిస్తున్నానంటూ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.