ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనెల ఎనిమిదో తేదీన జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ సభకు 1.7 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర్ ప్రసాద్ తెలిపారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విజయవాడ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విశాఖ నుంచి కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జన సమీకరణ గురించి కలెక్టర్ మాట్లాడుతూ విశాఖ నగరం నుంచి 1.2 లక్షల మంది, నాలుగు గ్రామీణ మండలాల నుంచి పది వేల మంది, అనకాపల్లి జిల్లా నుంచి 40 వేల మందిని సమీకరించేందుకు నిర్ణయించామన్నారు. సభకు వచ్చే వారికి రవాణా, భోజన సదుపాయం కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. నగర సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ 22 ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పిస్తామన్నారు. బందోబస్తుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.