విశాఖ నగరంలో ఈనెల ఎనిమిదో తేదీన జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరం కలిసి పనిచేద్దామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రెండు లక్షల మంది ప్రధాని సభకు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఎక్కడ పార్కింగ్ చేయాలన్నది ముందుగానే ఆయా జిల్లాలకు చెందిన అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగాకుండా నగరంలో పార్కింగ్ ప్రాంతాల వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. రియల్ టైమ్ లొకేషన్ సమాచారం ఉండేలా సీసీ టీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. అధికారులకు ప్రజా ప్రతినిధులు పూర్తిగా సహకరించాలని కోరారు. సమీక్షలో ముఖ్యమంత్రి కార్యాలయ సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్, ప్రభుత్వ విప్‌లు పి.గణబాబు, వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్‌గోపాల్, ఏపీ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ గండి బాబ్జీ, విశాఖ దక్షిణ టీడీపీ ఇన్‌చార్జి సీతంరాజు సుధాకర్, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్, డీసీపీ అజిత వేజెండ్ల, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.