విశాఖలో ఈ నెల 8న ప్రధాని పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్, నగర సీపీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. ప్రధాని ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన సంపత్ వినాయక్ ఆలయం వద్దకు చేరుకుని అక్కడ నుంచి ఓపెన్‌టాప్ వాహనంపై బహిరంగ సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకూ రోడ్‌షో నిర్వహిస్తారన్నారు. సంపత్ వినాయక్ ఆలయం నుంచి సభా ప్రాంగణం వరకూ విద్యుత్ దీపాలతో అలంకరించాలన్నారు. సభకు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చే వారికి భోజన వసతి కల్పించాలని, వచ్చేవారంతా సురక్షితంగా తిరిగి వెళ్లేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.