ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై గరికపాటి టీమ్ స్పందించింది. ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపింది. గరికపాటి నరసింహారావుపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు దుష్ర్పచారం చేస్తున్నాయని.. ఈ తప్పుడు ప్రచారంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులను కలత చెంతుతున్నారని తెలిపింది. ఈ మేరకు గరికపాటి నరసింహారావు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు, యూట్యూబ్ ఛానెళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోస్టులో రాసుకొచ్చారు. వారు చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవీ, సత్యదూరమైనవని పేర్కొన్నారు. వేర్వేరు ఘటనల్లో గరికపాటి నరసింహారావు ఎవరెవరికో చెప్పని క్షమాపణలు చెప్పినట్లుగా పేర్కొంటున్నారని.. ఆయన గౌరవానికి భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని గరికపాటి టీమ్ పేర్కొంది.
గరికపాటి పారితోషికాలు, ఆస్తుల విషయాల్లోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన టీమ్ మండిపడింది. గరికపాటిపై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని.. తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లు, సంస్థలపై పరువు నష్టం కేసులు దాఖలు చేస్తామని హెచ్చరించింది. ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వివాహం, వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్ ఛానెళ్లలోనూ అనేక వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గరికపాటిపై కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన టీమ్ మండిపడింది. గరికపాటి పరువు తీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
గరికపాటి నరసింహారావు మొదటి భార్య కామేశ్వరి పేరిట కొన్ని వీడియోలు యూట్యూబ్ ఛానెళ్లలో ఉన్నాయి. ఈ వీడియోల్లో కామేశ్వరి.. గరికపాటి నరసింహారావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీమ్ స్పందించింది. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, సత్యదూరమైనవని కొట్టిపారేసింది. గరికపాటి గౌరవానికి భంగం కలిగించేలా ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఇకనైనా ఇలాంటి ప్రచారం ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గరికపాటి టీమ్ స్పష్టం చేసింది.