గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రీన్ ఎనర్జీ రంగంలో సుమారు ఏడున్నర లక్షల ఉద్యోగాలను కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం రెండు కీలక ఒప్పందాలు జరిగాయి. సుజ్లాన్ ఎనర్జీ, స్వనీతీ ఇనిషియేటివ్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో సుజ్లాన్ కంపెనీ, ఏపీ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. అలాగే స్వనీతి, ఏపీ ప్రభుత్వం మధ్య మరో ఎంవోయూ కుదిరింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ప్రపంచం మొత్తం పునరుత్పాధక ఇంధనం వైపుగా అడుగులు వేస్తోందన్న నారా లోకేష్.. గ్రీన్ ఎనర్జీ నైపుణ్యం విషయంలో ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు. అందుకోసమే ఈ రెండు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఒప్పందాల కారణంగా ఆంధ్రప్రదేశ్ యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. వచ్చే 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌ను విండ్ ఎనర్జీ నైపుణ్యాల కేంద్రంగా మార్చడానికి సుజ్లాన్ ఎనర్జీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.
సుజ్లాన్ గ్రూప్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం.. సుజ్లాన్ ఎనర్జీ ఏపీలో గ్రీన్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించనుంది. దీనిని భారతదేశంలోనే అతిపెద్ద విండ్ ఎనర్జీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌గా అధికారులు చెప్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే నాలుగేళ్ల కాలంలో 12 వేల మంది యువతకు గ్రీన్ ఎనర్జీ రంగంలో శిక్షణ అందిస్తారు. ఈ 12 వేల మందిలో 3 వేల మంది వరకూ మహిళలు ఉంటారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో అందులోనూ విండ్ ఎనర్జీలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వీరికి నైపుణ్య శిక్షణ అందిస్తారు.
దీని ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగానికి కావాల్సిన ఉద్యోగులు దొరుకుతారని అధికారులు చెప్తున్నారు. అలాగే ఏపీ యువతకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్తున్నారు. విండ్ పవర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో భాగమైన ఎలక్ట్రికల్, మెకానికల్, బ్లేడ్ టెక్నాలజీ, మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వంటి అంశాలలో వచ్చే నాలుగేళ్లలో సుజ్లాన్ ఎనర్జీ సంస్థ 12 వేల మంది యువతకు ట్రైనింగ్ ఇవ్వనుంది.
అలాగే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు యూనివర్సిటీల సహకారంతో నిర్మాణాత్మక పాఠ్యాంశాలను రూపొందిస్తుంది. వచ్చే ఐదేళ్లలో ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం.. అందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ రంగంలోనే ఏడున్నర లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పెట్టుకుంది. ఆ దిశగా కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది.