సంక్రాంతి పండగవేళ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. సరదాగా గాలిపటం ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి భవనంపై నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబోలులో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జూపల్లి నరేందర్ అనే వ్యక్తి పిట్టగొడ లేని భవనంపై గాలిపటం ఎగురవేస్తూ.. ప్రమాదవశాత్తూ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందాడని వెల్లడించారు.
ఇక చైనా మాంజా కారణంగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై వెళ్తుండగా.. రోడ్డు అడ్డంగా ఉన్న చైనా మాంజా గొంతుకు కోసుపోయింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఖర్ధనూరు గ్రామం వద్ద వెంకటేష్ అనే వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న వెంకటేష్ మెడకు చైనా మాంజా కోసుకుపోయింది. మాంజా మెడను బలంగా తెంపడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. స్థానికులు గమనించి వెంటనే 108కు ఫోన్ చేశారు. క్షతగాత్రుని పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. వెంకటేష్ స్వస్థలం వికారాబాద్ కాగా.. పటాన్ చెరు నుంచి శంకర్ పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పతంగులు ఎగరేసేందుకు చైనా మాంజా వాడొద్దని పోలీసులు, న్యాయస్థానాలు హెచ్చరిస్తున్నా.. కొందరు వినిపించుకోవటం లేదు. మాంజా వల్ల ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలను వారు గుర్తు చేస్తున్నారు. గాలిపటాలకు వాడే సింథటిక్ తీగ మానవ, వన్యప్రాణుల జీవితానికి ముప్పు అని అంటున్నారు. చైనా మాంజా అమ్మినా.. కొన్నా జైలు శిక్షే అని ఇప్పటికే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి మాంజా విక్రయించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇక పిల్లలు గాలి పటాలు ఎగురవేసే సమయంలో తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెడుతుండాలి. లేదంటే ప్రమాదవాశాత్తు ప్రాణాల మీదకు తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది.