రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసి కార్యక్రమ విజయవంతానికి చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా, కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఈనెల 25న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమ నిర్వహణపై మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నేతృత్వంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్టు తెలిపారు. వివిధ జిల్లాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరు కానున్నారన్నారు. గవర్నర్ చేతులమీదుగా యువఓటర్లకు ఈపీఐసీ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధంగా వుండాలన్నారు. కళాశాలల, యూనివర్సీటీ విద్యార్థినీ, విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని ఓటర్లుగా పేరు నమోదు చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌ఐవోకు సూచించారు. సమావేశంలో రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీవో కావూరి చైతన్య, రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం అసిస్టెంట్ సెక్రటరీ ఆంజనేయులు, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఎస్వో కొండారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, యువజన సంక్షేమ అధికారి యు.శ్రీనివాసరావు, డీఐపీఆర్‌వో యు.సురేంద్రనాథ్, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎ.రవీంద్రరావు, డీఈవో యూవీ సుబ్బారావు, ఆర్‌ఐవో సి.శివ సత్యనారాయణరెడ్డి, తహసీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.