కలకాలం తోడుండాల్సిన భర్తే కసాయి మారాడు. భార్యని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనను పూర్తిగా విచారించిన పోలీసులకు విస్తూపోయే నిజాలు తెలిశాయి. ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త, ఆమెను ముక్కలుముక్కలు నరికి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా డెడ్‌బాడీని కుక్కర్‌లో ఉడికించాడు. మిగతా శరీర భాగాలను జిల్లెల్లగూడ చందన చెరువులో పారేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి మాజీ సైనికుడు. వృత్తి రీత్యా డీఆర్డీవోలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ పని చేస్తున్నాడు. జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంటక మాధవి(35)తో నివాసం ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నెల 13న మాధవి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్‌లో మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.ఇలా ఫిర్యాదు చేస్తున్న సమయంలో తనకు ఏ విషయం తెలియనట్లుగా గురుమూర్తి అత్తామామలతో కలిసి మీర్‌పేట పోలీస్ స్టేషన్‌కి వచ్చాడు. అయితే, విచారించిన పోలీసులకు సంచలన విషయాలు తెలిసినట్లు సమాచారం. గురుమూర్తి తన భార్యను చంపిన విషయం తెలిసింది. తన భార్యని చంపడానికి ముందు కుక్కను చంపినట్లు తేలింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.