ఈమధ్య కాలంలో ప్రతీ ఒక్కరికీ కోపతాపాలు ఎక్కువ అవుతున్నాయి. ఎవరిని చూసినా చిన్న చిన్న కారణాలకే విపరీతమైన కోపం తెచ్చుకుంటూ.. క్షణాకావేశానికి లోనవుతూ తమ ప్రాణాలు తీసుకోవడమో.. తమకు సంబంధించిన వాళ్ల ప్రాణాలు తీయడమో చేస్తున్నారు. అలాగే చేసిందో తల్లి. మూడేళ్ల వయసు కూడా నిండని.. తన ఇద్దరు కుమారులను చంపేసింది. ముఖ్యంగా తమ ఇంట్లోని నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి పిల్లలిద్దరినీ కిందకు తోసేసింది. తీవ్రగాయాలపాలైన చిన్నారులు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ డయ్యూలోని దల్వాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న సీమా యాదవ్‌కు భర్తతో పాటు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఆ ఇద్దరు చిన్నారుల వయసు మూడేళ్లకంటే తక్కువే. పెళ్లై, పిల్లలు పుట్టిన కొంత కాలం పాటు హాయిగానే సాగిన వీరి కాపురంలో మనస్పర్థలు వచ్చాయి. దీంతో సీమా యాదవ్‌కు, ఆమె భర్తకు మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. వాటిని తగ్గించుకోవాలని జంట ఎంత ప్రయత్నిస్తున్నా అవి తగ్గట్లేదు.
ముఖ్యంగా జనవరి 20వ తేదీ రోజు రాత్రివేళ కూడా సీమాకు తన భర్తకు మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. గట్టిగట్టిగా తిట్టుకున్నారు. తల్లిదండ్రుల గొడవకు మేల్కున్న చిన్నారులు ఇద్దరూ ఏడవడం ప్రారంభించారు. అయితే అది గుర్తించిన సీమా.. వారిని ఎత్తుకుని బుజ్జగించాల్సింది పోయి.. కోపంతో తీసుకెళ్లి నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి వారిద్దరినీ కింద పడేసింది. ఆపై తాను కూడా దూకేందుకు ప్రయత్నించింది. కానీ విషయం గుర్తంచిన భర్త సీమాను వెనక్కి లాగాడు.
ఆపై వెంటనే కిందకు వెళ్లి తీవ్ర గాయాలపాలైన తన ఇద్దరు కుమారులను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆ చిన్నారులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సీమా యావవ్‌పై కేసు నమోదు చేశారు. కావాలనే ఆమె తన కుమారులను చంపడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లలు ఇద్దరూ చనిపోవడం, భార్య జైలుకు వెళ్లడంతో సీమా యాదవ్ భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. సీమా పిల్లల వద్దకు వెళ్తుంటే వారి ఏడుపు ఆపేందుకు వెళ్తుందనుకున్నానని.. కానీ వారిద్దరినీ కింద పడేసేసరికి తనకు కాళ్లూ చేతులు ఆడలేదంటూ రోదించిన తీరు స్థానికులందరి చేత కంటనీరు పెట్టించింది.