కర్ణాటకలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లాలో కూరగాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బాధితులు సవనూర్ నుంచి కుంత మార్కెట్‌కు కూరగాయలు అమ్మేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయానికి లారీలో 28 మందికిపైగా ఉన్నట్టు తెలిపారు. మృతులంతా సవనూరు తాలూకాకు చెందినవారని సమాచారం.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఉత్తర కన్నడ జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఘటనపై యల్లాపూర్ పోలీసులు కేసు నమోదుచేసి.. దర్యాప్తు చేపట్టారు. వెనుక నుంచి వస్తోన్న ఓ వాహనానికి మార్గం ఇచ్చేందుకు లారీ డ్రైవర్ పక్కకు తప్పుకున్న సమయంలోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. రహదారిపై రైలింగ్ లేకపోవడంతోనే అదుపుతప్పిందని అధికారులు తెలిపారు. ఉదయం 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు.
కర్ణాటకలోని హంపికి విహార యాత్ర కోసం వచ్చిన కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థుల వాహనం ప్రమాదానికి గురయ్యింది. వారి వాహనం బోల్తా పడి డ్రైవర్ శివతో సహా ముగ్గురు విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సింధనూరు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో మరికొందరు విద్యార్థులకు గాయాలు కాగా.. వారిని సింధనూరు ఆస్పత్రిలో చేర్పించిన చికిత్స అందిస్తున్నారు. హంపి క్షేత్రంలో జరుగుతున్న నరహరి తీర్థుల ఆరాధనోత్సవాలకు హాజరయ్యేందుకు మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు.. తుఫాన్ వాహనంలో బయల్దేరారు.