కర్ణాటకలో బుధవారం రోజు ఉదయం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఉత్తర కన్నడలో ఓ కూరగాయల లారీ బోల్తా పడగా.. మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 14 మంది గాయపడ్డారు. రాయ్‌చూర్‌లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 10 మంది గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ముఖ్యంగా రెండు ప్రమాదాల్లో చనిపోయిన మొత్తం 15 మంది మృతుల కుటుంబాలకు 3 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించబోతున్నట్లు వివరించారు. అలాగే మృతులకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు అందరికీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు కూడా త్వరగా కోలుకోవాలంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా.. గాయాల పాలైన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు.
ఉత్తర కన్నడ జిల్లాలో కూరగాయల లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది గాయపడ్డారు. అయితే ఈ విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను స్థానిక ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ఈక్రమంలోనే చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు.
ఈ ఒక్క ప్రమాదంలోనే ఇప్పటి వరకు మొత్తం 11 మంది చనిపోయగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయంలో మొత్తం 28 మందికి పైగా లారీలో కుంత మార్కెట్‌కు కూరగాయలు అమ్మేందుకు వెళ్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ ప్రమాద బాధితులు అందరూ సవనూర్‌కు చెందిన వారే.
మరోవైపు కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థులు.. హంపి విహార యాత్ర కోసం వచ్చారు. ఈక్రమంలోనే వీరి వాహనం బోల్తా పడగా.. డ్రైవర్ సహా ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది విద్యార్థులు తీవ్ర గాయాల పాలుకాగా.. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను సింధనూరు ఆస్పత్రిలో చేర్పించిన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.