భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఇవాళ రాత్రి 7 గంటలకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి.. ఐదు మ్యాచుల సిరీస్‌లో బోణీ కొట్టాలని ఇరు జట్లూ చూస్తున్నాయి. ఇక మ్యాచ్ వేదిక అయిన ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టుకు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఇప్పటివరకు భారత్ ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక్కదాంట్లో మాత్రమే ఓడిపోయింది. అది కూడా ఇంగ్లాండ్‌తోనే కావడం గమనార్హం.
ఇక ఈ స్టేడియంలో ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లోనే భారత్ ఓడిపోయింది. మహేంద్ర సింగ్ ధోన కెప్టెన్సీలో ఇక్కడ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడ్డ భారత్.. ఓటమిని చవిచూసింది. 2011లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. సురేశ్ రైనా (29 బంతుల్లో 39 రన్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. అనంతరం కెవిన్ పీటర్సన్ సత్తాచాటడంతో ఇంగ్లాండ్ ఆరు వికెట్లు తేడాతో ఈ మ్యాచ్‌లో గెలిచింది.
ఈ మ్యాచ్ తర్వాత ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ మరో 6 మ్యాచులు ఆడింది. అందులో అన్నింట్లోనూ గెలుపొందింది. ఓవరాల్‌గా ఈ వేదికలో ఆడిన 7 మ్యాచుల్లో ఆరింట్లో గెలిచి.. మెరుగైన రికార్డు కలిగి ఉంది. ఇక ఇంగ్లాండ్‌తో భారత్ ఇప్పటివరకు 24 టీ20 మ్యాచ్‌లలో తలపడింది. అందులో అత్యధికంగా 13 మ్యాచ్‌లలో భారత్ గెలుపొందింది. మరో 11 మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ గెలిచింది.ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ ఇదివరకే తమ తుది జట్టును ప్రకటించింది.
భారత్‌తో జరిగే తొలి టీ20కి ఇంగ్లాండ్ తుది జట్టు ఇదే:
బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జేమీ ఓవర్టన్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
మరోవైపు భారత్ మాత్రం టాస్ సమయంలోనే తుది జట్టును ప్రకటించనుంది.
ఇంగ్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు భారత్ తుది జట్టు అంచనా:
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ