సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది యువత కోరి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. ఎంత రిస్కైనా చేయడానికి వెనకాడట్లేదు. ఒక్కోసారి తమ ప్రాణాలనే ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారు. ఇటీవల జరిగిన అలాంటి కొన్ని ఘటనలు ఇందుకు ఉదాహారణ. తాజాగా ఓ యువకుడు టిక్‌టాక్ కోసం వీడియో కోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. సింహాన్ని దూరం నుంచి చూస్తేనే కాళ్లుచేతులు వణికిపోతాయి. అలాంటిది యువకుడు ఏకంగా దాని బోనులోకి ప్రవేశించాడు. చివరకు దాని చేతికి చిక్కి తీవ్రగాయాలతో బయడపడి.. ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. విస్తుగొలిపే ఈ ఘటన పాకిస్థాన్‌లో (Pakistan) చోటు చేసుకొంది.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ ప్రావిన్సులకు చెందిన ముహమ్మద్ అజీమ్ అనే యువకుడు.. లాహోర్ సమీపంలోని ఓ జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడ బోనులో ఉన్న సింహంతో టిక్‌టాక్ వీడియోచేయాలని భావించాడు. అయితే, అక్కడి సంరక్షకుడి నుంచి అనుమతి తీసుకోకుండానే ఆ బోనులోకి దూరాడు. అంతే, ఆ సింహం అతడిపై ఒక్క ఉదుటన దూకి దాడి చేసింది. అజీమ్ గట్టిగా కేకలు వేయడంతో జూ సిబ్బంది వచ్చి దాని బారి నుంచి అతడిని రక్షించి, బయటకు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన అతడ్ని హుటాహుటిన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అతడి తల, చేతులు, ముఖానికి తీవ్ర గాయాలైనట్టు చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జంతు సంరక్షణ కేంద్రం యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, ఫామ్ యజమాని బ్రీడింగ్ లైసెన్సును రద్దు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. ‘సింహాలు, చీతాలు, పులులు, పుమాలు, పెద్ద పులులు వంటి ఐదు జంతువులను చట్ట ప్రకారం నియంత్రణ ఉంది.. ఈ జంతువుల పెంపకానికి సంబంధించి గత 70 సంవత్సరాలుగా ఎటువంటి చట్టం లేదు. దీని వల్ల ఇళ్లలో వాటి ఉనికికి దారితీసింది’ అని మరియమ్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఆ సంరక్షణ కేంద్రంలోని జంతువుల వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో ప్రదర్శించడంపై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ ఆ యువకుడు నింబంధనలను ఉల్లంఘించి.. బోనులోకి దూకి ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నాడు.