కర్ణాటక బీజేపీలో అంతర్గత కుమ్ములాట మరింత ముదిరింది. మైనింగ్ కింగ్, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి... మాజీ మంత్రి శ్రీరాములు మధ్య కలహాలు తీవ్రరూపు దాల్చాయి. తన రాజకీయ జీవితానికి అంతం పలికేందుకు గాలి జనార్దన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ శ్రీరాములు ఆరోపిస్తున్నారు. పార్టీ నుంచి తప్పుకునేందుకైనా తాను సిద్దమని ఆయన స్పష్టం చేశారు. "గాలి జనార్దన్ రెడ్డి నాపై బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఉసిగొల్పుతున్నారు. జనార్దన్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. తన స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీ నాయకత్వం నడిచేలా పావులు కదుపుతున్నారు. నేను గత మూడు దశాబ్దాలుగా బీజేపీ విధేయుడిగా ఉన్నాను. ఎప్పుడూ పార్టీకి ద్రోహం తలపెట్టలేదు" అని స్పష్టం చేశారు. శ్రీరాములు తాజాగా మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జి రాధామోహన్ అగర్వాల్ పైనా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో అగర్వాల్ తనను అవమానానికి గురిచేశాడని శ్రీరాములు మండిపడ్డారు. "సందూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి నేనే కారణమని అగర్వాల్ నిందించారు. బీజేపీ అభ్యర్థి బంగారు హనుమంత కోసం నేను పనిచేయలేదని ఆయన ఆరోపణలు చేశారు. నా కారణంగానే పార్టీ ఓడిపోయిందని అభాండాలు వేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర మౌనం వీడాలని కోరుకుంటున్నా. సందూర్ నియోజకవర్గంలో నేను ఎంతో చురుగ్గా ప్రచారం చేశానని విజయేంద్రకు తెలుసు" అని శ్రీరాములు వివరించారు.