డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహా ఏర్పాటులో లోటు పాట్లు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం, విగ్రహ పరిసర ప్రాంతాలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మంగళవారం నాడు పరిశీలించారు. అంబేద్కర్ మ్యూజియాన్ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ... అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై చంద్రబాబు ముందుగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అమరావతిలో భూమి కేటాయించారని గుర్తుచేశారు. అమరావతి స్మృతివనం పక్కనపెట్టి ఇక్కడ నిర్మాణం చేశారని తెలిపారు. ఎన్నికల ముందు హడావుడిగా అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రారంభించారని మండిపడ్డారు. ఇక్కడ చూస్తే చాలా పనులు చేయాల్సి ఉందని అన్నారు. ఇంకా పనులు పూర్తి కాలేదని తెలిపారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేస్తామని అన్నారు. కక్ష సాధింపు చర్యలు కూటమి ప్రభుత్వంలో ఉండవని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.