మన్యంలో చలితీవ్రత కొనసాగుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత దిగజారుతున్నాయి. బుధవారం అరకులోయలో 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 5.8, జి.మాడుగులలో 6.2, డుంబ్రిగుడలో 6.4, జీకేవీధిలో 6.6, హుకుంపేటలో 6.9, పెదబయలులో 8.2, అనంతగిరిలో 9.7. ముంచంగిపుట్టులో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్ పరిసరాల్లో కొనసాగుతున్న అధిక పీడనం నుంచి చలి గాలులు ఒడిశా మీదుగా మన్యం వైపు వీస్తున్నాయి. దీంతో చలి తీవ్రత అధికంగా వుంది. సాయంత్రం నాలుగు గంటల నుంచే వాతావరణం చాలాచల్లగా వుంటున్నది. ఉదయం పదిగంటల వరకు మంచు తెరలు వీడడంలేదు. పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించాల్సి వచ్చింది. చలి బారి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఉన్ని దుస్తులు ధరించి, చలి మంటలు వేసుకుంటున్నారు. చలి తీవ్రతకు స్థానికులు ఇబ్బంది పడుతుండగా, పర్యాటకులు మాత్రం ఆస్వాదిస్తున్నారు.