పండ్లు, కూరగాయలు తరలిస్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో పది మంది మృతిచెందారు. 18మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర కన్నడ జిల్లా గుళ్ళాపుర వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా, ఎదురుగా వస్తున్న వాహనానికి దారి వదిలే క్రమంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, లారీ గుంతలోకి బోల్తా పడింది. దీంతో పండ్లు, కూరగాయల సంచులపై కూర్చున్నవారు వాటి కింద ఇరుక్కుని, ఊపిరాడక విలవిల్లాడారు. అక్కడికక్కడే 9మంది చనిపోగా, ఆస్పత్రిలో మరొకరు మరణించారు. పొగమంచు కారణంగా సుమారు గంటపాటు ఎవరూ ఘటనను గుర్తించలేకపోయారు. దీంతో మృతుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెప్పారు. మృతులను ఫయాజ్ ఇమాంసాబ్ జమఖండి(45), వసీమ్ విరుల్లా ముడగేరి(35), ఇజాజ్ ముస్తాక్ ముళ్ళ(20), సాదిక్ బాషా (30), గులాం హుసేన్ జవళి(40), ఇంతియాజ్ మంజఫర్ ముళకే (36), అల్ఫాజ్ జాఫర్ మండక్కి(25), జిలాని అబ్దుల్ జఖాతి(25), అస్లాం బాబులి బెన్నె(24), జలాల్ తార(30)గా గుర్తించారు. వీరంతా సంతల్లో వ్యాపారాలు చేస్తుంటారు. ప్రమాదంపై సీఎం సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.3లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేలు చొప్పున ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు.