రంజీ ట్రోఫీలో భాగంగా ముంబయి, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఓ అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. జమ్మూ కెప్టెన్ పరాస్ డోగ్రా 40 ఏళ్ల వయసులో సూపర్‌మ్యాన్ ఫీట్‌తో అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో పరాస్ అందుకున్న ఈ క్యాచ్ చూస్తే... ఔరా అనాల్సిందే. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో ముంబయి కెప్టెన్ అజింక్య రహానే కొట్టిన అమేజింగ్ షాట్‌ను అంతే అద్భుతంగా క్యాచ్ పట్టాడు పరాస్. దీని తాలూకు వీడియోను బీసీసీఐ డొమెస్టిక్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది. వాటే క్యాచ్... పరాస్ డోగ్రా గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఒడిసిపట్టిన ఈ క్యాచ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అని రాసుకొచ్చింది. ఇక, ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 120 పరుగులకే ఆలౌట్ అయిన ముంబయి జట్టు... రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పుంజుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ అజేయ శతకం (113 బ్యాటింగ్) చేయడం ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. తనుశ్ కొటియాన్ (58 బ్యాటింగ్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ముంబయిని ఆదుకున్నారు. ఈ ద్వయం ఇప్పటికే 173 పరుగుల భాగస్వామ్యం అందించింది. అటు జమ్మూ తన మొదటి ఇన్నింగ్స్ లో 206 రన్స్‌కు ఆలౌట్ అయింది. దీంతో ప్రస్తుతం ముంబయి 188 పరుగుల ఆధిక్యంలో ఉంది.