పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ నొమన్ అలీ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి పాకిస్థాన్ స్పిన్నర్‌గా రికార్డులకు ఎక్కాడు. వెస్టిండీస్‌తో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచులో అలీ ఈ ఘనత అందుకున్నాడు.ఇక ఓవరాల్‌గా పాకిస్థాన్ తరుపున టెస్టుల్లో హాట్రిక్ సాధించిన ఐదో బౌలర్‌గా నిలిచాడు.ముల్తాన్ వేదికగా శనివారం పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్‌వైట్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. తాము తీసుకున్న నిర్ణయం తప్పని వెస్టిండీస్‌కు చాలా త్వరగానే అర్థమై ఉంటుంది. పాక్ బౌలర్ల ధాటికి 37 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో విండీస్ కష్టాలను రెట్టింపు చేశాడు పాక్ స్పిన్నర్ నొమన్ అలీ. 12వ ఓవర్‌ను వేసిన అతడు తొలి బంతికి జస్టిన్ గ్రీవ్స్(1), రెండో బంతికి టెవిన్ ఇమ్లాచ్(0), మూడో బంతిని కెవిన్ సిన్‌క్లెయిర్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి స్పిన్నర్‌గా నిలిచాడు.
అలీ విజృంభణలో విండీస్ 37 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే.. కీమర్ రోచ్ (25) రాణించడంతో పాటు గుడాకేష్ మోతీ (49 నాటౌట్), జోమెల్ వారికన్ (34 నాటౌట్) లు పోరాడుతుండడంతో ప్రస్తుతం 39 ఓవర్లలో వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 150 పరుగులతో నిలిచింది.
టెస్టుల్లో పాకిస్థాన్ తరుపున హ్యాట్రిక్ తీసిన బౌలర్లు వీరే..
వసీం అక్రమ్ - 1999లో శ్రీలంకపై - లాహోర్ వేదికగా
వసీం అక్రమ్ - 1999లో శ్రీలంకపై - ఢాకా వేదికగా
అబ్దుల్ రజాక్ - 2000లో శ్రీలంకపై - గాలే వేదికగా
నసీం షా - 2020లో బంగ్లాదేశ్‌పై - రావల్పిండి వేదికగా
నొమన్ అలీ - 2025లో వెస్టిండీస్ పై - ముల్తాన్ వేదికగా..