టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 2024 ఏడాదికి గాను ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), సికిందర్ రజా (జింబాబ్వే) లతో పోటీపడి మరీ అర్ష్‌దీప్ ఈ అవార్డు దక్కించుకున్నాడు. ఇక గతేడాది అర్ష్‌దీప్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 2024లో 18 మ్యాచులు ఆడిన ఈ పేసర్ ఏకంగా 36 వికెట్లు పడగొట్టాడు. దీంతో గతేడాది టీమిండియా తరఫున టీ20ల్లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అలాగే గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో మొత్తం 8 మ్యాచుల్లో 7.16 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. ఇక భారత్ తరఫున పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా అర్ష్‌దీపే కావడం విశేషం. ఇప్పటివరకు అతడు ఈ ఫార్మాట్‌లో 97 వికెట్లు తీశాడు. మరో మూడు వికెట్లు సాధిస్తే.. టీమిండియా తరఫున టీ20ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు.