గత కొన్ని రోజులుగా టెన్నిస్ అభిమానులను విశేషంగా అలరించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ ముగిసింది. ఇవాళ మెల్బోర్న్ లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ యానిక్ సిన్నర్ ఘనవిజయం సాధించాడు. ఏకపక్షంగా సాగిన ఈ టైటిల్ పోరులో ఇటలీకి చెందిన సిన్నర్ 6-3, 7-6, 6-3తో వరుస సెట్లలో వరల్డ్ నెంబర్ 2 అలెగ్జాండర్ జ్వెరెవ్ ను ఓడించాడు. సెమీఫైనల్లో లెజెండరీ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ గాయంతో వాకోవర్ ఇవ్వడంతో ఫైనల్ చేరిన జర్మనీ ఆటగాడు జ్వెరెవ్... డిఫెండింగ్ చాంపియన్ సిన్నర్ ముందు ఏమాత్రం నిలవలేకపోయాడు. జ్వెరెవ్ రెండో సెట్ లో మాత్రం కాస్తంత పోటీ ఇచ్చినా, టైబ్రేకర్ లో ఆ సెట్ ను చేజార్చుకున్నాడు. కాగా, సిన్నర్ కు ఇది వరుసగా రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. గతేడాది కూడా ఇక్కడ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సిన్నరే గెలిచాడు. అంతేకాదు, అమెరికా లెజెండ్ జిమ్ కొరియర్ తర్వాత వరుసగా రెండు పర్యాయాలు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన పిన్న వయస్కుడిగా 23 ఏళ్ల సిన్నర్ ఘనత నమోదు చేశాడు. ఓవరాల్ కు సిన్నర్ కు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది యూఎస్ ఓపెన్ లోనూ సిన్నర్ విజేతగా నిలిచాడు