సుమారు 13 ఏళ్ల తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి రంజీ బాట పట్టనున్నాడు. ఈ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడనున్న కోహ్లీ.. జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి, బోర్డర గవాస్కర్ ట్రోఫీలో వైఫల్యం తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్లు రంజీ బాటపట్టారు. ఈనెల 23న ప్రారంభమైన మ్యాచ్‌లలో రోహిత్, జడేజా, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ లాంటి ప్లేయర్లు బరిలోకి దిగారు. కానీ మెడ నొప్పి కారణంగా కోహ్లీ రీఎంట్రీ కాస్త ఆలస్యమయింది.
దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడనున్న నేపథ్యంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ ఆడనున్న నేపథ్యంలో స్టేడియం వద్ద భారీగా భద్రతను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌కు 10 వేల మంది ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని డీడీసీఏ భావిస్తోందట. ఇందుకోసం డీడీసీఏ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. నార్త్ ఎండ్, ఓల్డ్ క్లబ్ హౌస్‌ను అభిమానుల కోసం అందుబాటులోకి తీసుకురానుందట.
ఒకవేళ ప్రేక్షకులు ఎక్కువై.. అదనపు సీటింగ్ అవసరమైతే.. మిగిలిన స్టాండ్స్‌ను గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను అభిమానులు ఉచితంగా వీక్షించేలా డీడీసీఏ ఏర్పాట్లు చేస్తోందని సమాచారం. మ్యాచ్ టికెట్లను విక్రయించడం లేదని డీడీసీఏ ప్రకటించింది. దీంతో ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఎలాంటి రుసుము అవసరం లేదు.
కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఆశించిన మేర రాణించలేకపోయాడు. 5 టెస్టుల్లో కలిపి.. 190 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతడు ఫామ్‌లోకి రావాలని పట్టుదలతో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే భారత్.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది. రైల్వేస్‌తో మ్యాచ్ ఆడిన తర్వాత కోహ్లీ భారత జట్టుతో కలవనున్నాడు. విరాట్ కోహ్లీ చివరిసారిగా 2012లో రంజీ మ్యాచ్ ఆడాడు. యూపీతో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో 43 రన్స్ స్కోరు చేశాడు.