మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమిండియా.. వరుసగా నాలుగో విజయం సాధించింది. ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌లలో గెలిచిన భారత్.. టోర్నీలో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం సూపర్-6లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో సెమీస్‌కు చేరువైంది.
మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. అయితే కెప్టెన్ విశ్వాసాన్ని నిలబెడుతూ భారత బౌలర్లు సత్తాచాటారు. బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశారు. దీంతో బంగ్లాదేశ్ స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయింది. తొలి ఐదుగురు బ్యాటర్లు.. 2, 2, 5, 5, 7 స్కోర్లు నమోదు చేశారు. దీంతో ఓ దశలో బంగ్లాదేశ్.. 22 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
ఈ దశో మవువా (14), సౌమాయా ఆక్తర్ (21 నాటౌట్) వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ 3 వికెట్లు తీయగా.. జోషిత, షబ్నామ్, త్రిష తలా ఓ వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు.. 43 బంతుల్లోనే మ్యాచ్ ముగించారు. ఓపెనర్, తెలుగమ్మాయి గొంగడి త్రిష 31 బంతుల్లో 40 పరుగులు చేసి సత్తాచాటింది. చివరకు భారత్ 7.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
కాగా ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ భారత్ గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్, ఆ తర్వాత మలేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లపై ఘన విజయం సాధించింది. టోర్నీ సూపర్ సిక్స్‌లో భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌లో జనవరి 28న స్కాట్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో సూపర్-6లో భారత్ తన చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే సెమీస్‌కు చేరువైన భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అధికారికంగా టాప్-4లోకి ప్రవేశించనుంది.