గత కొన్ని రోజులుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న టీమిండియా యంగ్ బ్యాటర్ 21 ఏళ్ల నితీశ్ కుమార్ రెడ్డి.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి టీ20 మ్యాచ్‌లో ఆడిన ఈ ప్లేయర్.. రెండో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. గాయం తీవ్రత దృష్ట్యా అతడు సిరీస్ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో శివమ్ దూబెను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. అయితే నితీశ్ కుమార్ రెడ్డి గాయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
వాస్తవానికి నితీశ్ రెడ్డి.. ఫిట్‌గానే కనిపించాడు. అనూహ్యంగా ప్రాక్టీస్‌లో గాయపడ్డాడు. దీంతో అతడికి నిజంగానే గాయమైందా.. అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై ఆకాశ్ చోప్రా మాట్లాడాడు. దేశవాళీతో పోలిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో వర్క్ లోడ్ భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
"నితీశ్ కుమార్ రెడ్డి.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతడికి ఏమైందని.. చాలా మందికి అనుమానం వచ్చింది. అది సహజమే. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో వర్క్‌లోడ్ అనేది భిన్నంగా ఉంటుంది. దేశవాళీ క్రికెట్‌లా ఉండదు. వర్క్‌లోడ్‌తో పాటు.. ఒత్తిడిని కూడా అధిగమించాల్సి ఉంటుంది. నితీశ్ నాణ్యమైన క్రికెట్ ఆడాడు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో సత్తాచాటాడు. అతడు అలసిపోయాడు. నిజానికి అతడింకా చిన్న పిల్లవాడే. సుదీర్ఘంగా క్రికెట్ ఆడేందుకు అతడి శరీరం ఇంకా సిద్ధంగా ఉండకపోవచ్చు. గాయం నుంచి కోలుకుని అతడు మళ్లీ వస్తాడు" అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.
ఇక నితీశ్ ప్లేసులో శివమ్ దూబెను జట్టులోకి తీసుకోవడం మంచి ఎంపిక అని ఆకాశ్ అన్నాడు. "రింకూ సింగ్ కూడా అందుబాటులో లేడు. అతడి ప్లేసులో రమణ్ దీప్ సింగ్‌కి అవకాశం ఇచ్చారు. దూబె తుది జట్టులోకి వస్తాడని అనుకుంటున్నా" అని చెప్పుకొచ్చాడు. కాగా సైడ్ స్ట్రెయిన్ కారణంగా నితీశ్ ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడు. వెన్ను గాయం కారణంగా రింకూ సింగ్ 2, 3వ టీ20లకు దూరమయ్యాడు. నితీశ్ ప్లేసులో శివమ్ దూబె, రింకూ ప్లేసులో రమణ్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చారు. ఇప్పుటికే ఆడిన 2 మ్యాచులోనూ గెలిచిన టీమిండియా 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో మ్యాచ్.. ఈనెల 28న జరగనుంది.