టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇందులో భాగంగా ఈనెల 23 నుంచి ముంబైలో జరిగిన ముంబై వర్సెస్ జమ్ము కశ్మీర్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి అభిమానులు.. స్టేడియానికి తరలివచ్చారు. అతడిని చూసేందుకు ఎగబడ్డారు. రోహిత్ శర్మ బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేసేందుకు వస్తే చాలు.. ఇక అరుపులతో స్టేడియం దద్దరిళ్లిపోయింది. ఈ నేపథ్యంలో అతడిని మరింత దగ్గరి నుంచి చూడాలని.. అతడితో ఫొటో తీసుకోవాలని కొందరు ఫ్యాన్స్ భావించారు. అయితే మైదానంలో అది సాధ్యం కాదని వారికి తెలుసు. దీంతో వారు వినూత్నంగా ఆలోచించారు.
మ్యాచ్ ముంబైలో జరుగుతోంది. రోహిత్ శర్మ ఉండేది కూడా ముంబైలోనే కావడంతో అతడు స్టేడియానికి తన కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది తెలుసుకున్న అభిమానులు మ్యాచ్ అయ్యాక.. రోహిత్ శర్మ కారులో వెళ్తుండగా చూడాలని.. వీలైతే ఫొటోలు తీసుకోవాలని భావించారు. అంతే శనివారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ గేడ్ వద్ద భారీగా ఫ్యాన్స్ గుమిగుడారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది.. రోహిత్ శర్మకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఎంట్రీ గేట్ నుంచే వెళ్లాలని సూచించారు.
సెక్యూరిటీ సిబ్బంది సూచన మేరకు రోహిత్ శర్మ ఎంట్రీ గేట్ నుంచి వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఇది తెలుసుకున్న అతడి ఫ్యాన్స్.. అక్కడికీ వచ్చేశారు. రోహిత్ శర్మ స్వయంగా కారు నడుపుకుంటూ రావడం చూసి.. సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యారు. రోహిత్.. రోహిత్.. అంటూ నినాదాలు చేశారు. కొందరైతే.. కారులో రోహిత్ వెళ్తుండగా సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక సుమారు పదేళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడిన రోహిత్ శర్మ.. ఆశించిన మేర రాణించలేకపోయాడు. జమ్ము కశ్మీర్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 28 రన్స్ మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమిపాలైంది. వచ్చే నెల ఆరు నుంచి భారత్.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడనుంది.