టీమిండియా యంగ్ సెన్షేషన్ తిలక్ వర్మ ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా బ్యాటర్, తెలుగు క్రికెటర్ 22 ఏళ్ల తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. 165 పరుగుల ఛేజింగ్‌లో ఓ దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ను.. తిలక్ వర్మ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో ఆదుకున్నాడు. సమయోచిత బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ మొత్తంగా 55 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
తన ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తిలక్ వర్మ ఓ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో వరుసగా నాటౌట్‌గా నిలుస్తూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతడు చివరగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 4 ఇన్నింగ్స్‌లలో 107*, 120*, 19*, 72* పరుగులు సాధించాడు. దీంతో నాటౌట్‌గా ఉంటూ.. మొత్తం 318 పరుగులు స్కోరు చేశాడు. ఇలా టీ20 క్రికెట్‌లో నాటౌట్‌గా ఉంటూ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా తిలక్ వర్మ నిలిచాడు.
ఓడిపోయేలా కనిపించిన మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించిన తిలక్ వర్మకు.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సలాం కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతకుముందు ఈ జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన మార్క్ చాప్‌మన్ అగ్రస్థానంలో ఉండేవాడు. అతడు 2023లో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లలో నాటౌట్‌గా ఉంటూ 271 పరుగులు చేశాడు. తాజాగా ఆ రికార్డును తిలక్ వర్మ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఆరోన్ ఫించ్ (240), శ్రేయస్ అయ్యర్ (240), డేవిడ్ వార్నర్ (239) ఉన్నారు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటిన తిలక్ వర్మ.. ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఈ క్రమంలోనే భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇప్పటివరకు 22 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ప్లేయర్.. 150కి పైగా స్ట్రైక్ రేటుతో 707 రన్స్ స్కోరు చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉండటం గమనార్హం. తన ప్రదర్శనతో అనతికాలంలోనే నమ్మదగ్గ ప్లేయర్‌గా ముద్ర వేసుకున్నాడు తిలక్ వర్మ. భారత జట్టులో సుస్థిర స్థానం సంపాదించడమే లక్ష్యంగా అతడు అడుగులు వేస్తున్నాడు.