రసవత్తర ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 టైటిల్ పోరులో వరల్డ్ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 విజేతగా అవతరించాడు. దీంతో అతడు వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించినట్టైంది. మరోవైపు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ చేరిన జ్వెరెవ్.. మూడో సారి కూడా ఓటమితో రనరప్ గా నిలిచాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తుది పోరులో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై 6-3 7-6(7-4) 6-3 తేడాతో గెలిచాడు సినర్. దీంతో సినర్ ఖాతాలో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ వచ్చి చేరింది. ఈ విజయంతో సినర్ మూడు గ్రాండ్ స్లమ్ టైటిల్స్ సాధించిన తొలి ఇటాలియన్ గా ఘనత సాధించాడు. అంతకముందు 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుచుకున్నాడు సినర్.
టైటిల్ ఫేవరెట్ గా భారీ అంచనాలతో ఈ టోర్నీ బరిలోకి దిగిన సినర్.. తుది పోరులోనూ అదే జోరును కొనసాగించాడు. తొలి సెట్‌లో హోరాహోరీగా తలపడిన సినర్, జ్వెరెవ్... ఒకదశలో 3-3 పాయింట్లతో సమానంగా నిలిచారు. కానీ, ఆ తర్వాత సినర్ దూకుడు ప్రదర్శించి సెట్‌ను దక్కించుకున్నాడు.
రెండో సెట్‌లో జర్మనీ జ్వెరెవ్.. కాస్త పుంజుకుని దూకుడు ప్రదర్శించేలా కనిపించాడు. 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అనంతరం ఇద్దరూ వరుసగా పాయింట్లు సాధించడం వల్ల స్కోరు 6-6తో సమంగా నిలిచింది. దీంతో టై బ్రేకర్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ టై బ్రేకర్ ఆరంభంలో జ్వెరెవ్ ఆధిక్యంలో నిలిచాడు. ఆ తర్వాత సినర్ క్రమంగా పుంజుకుని రెండో సెట్‌ను గెలుపొందాడు.
అందుకే కేకేఆర్‌ను వీడాను.. ఆ మాటలు వినలేక బాత్రూమ్‌లో కూర్చున్న: శ్రేయస్ అయ్యర్"అందుకే కేకేఆర్‌ను వీడాను.. ఆ మాటలు వినలేక బాత్రూమ్‌లో కూర్చున్న: శ్రేయస్ అయ్యర్"
ఇక మూడో సెట్‌లోనూ ఆరంభంలో దూకుడుగా ఆడి గట్టిపోటీనిచ్చిన జ్వెరెవ్.. అనంతరం జోరును కొనసాగించలేకపోయాడు. దీంతో సినర్ మూడు సెట్ లో హవాను కొనసాగించి దీన్ని కూడా దక్కించుకున్నాడు. మొత్తంగా ఈ పోరులో సినర్ 6 ఏస్ లు కొడితే.. జ్వెరెవ్ ఏకంగా 12 ఏస్ లు కొట్టడం విశేషం. కానీ పదే పదే అనవసర తప్పిదాలు చేసిన జ్వెరెవ్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మ్యాచ్ లో సినర్.. రెండు సార్లు జ్వెరెవ్ సర్వీస్ ను బ్రేక్ చేశాడు.